Taraka Ratna Health Update : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు!
Taraka Ratna Health Update : సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు.
Taraka Ratna Health Update : సినీ హీరో నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింత విషయంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చింది. ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 22 రోజులుగా తారకరత్నకు వైద్యం చేస్తున్నారు. తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో నందమూరి కుటుంబసభ్యులతో పాటు బాలకృష్ణ బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తారకరత్నకు విదేశీ వైద్యుల చికిత్స
ప్రస్తుతం తారకరత్నకు ప్రత్యేక విదేశీ వైద్య బృందం చికిత్స అందిస్తోంది. తారకరత్న చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్లు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తారకరత్న హార్ట్, న్యూరో సమస్యలకు మెరుగైన వైద్యం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వెల్లడించారు. వైద్యులు శక్తి వంచన లేకుండా ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
వాస్తవానికి తారకరత్న గుండెపోటుకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రికి వెళ్లేందుకు సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. ఈ మధ్యలో ఆయన శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రభావం మెదడుపైన తీవ్రంగా పడింది. ఇదే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారేందుకు కారణం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. మరోవైపు మెదడుకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గుండె కూడా చాలా వరకు బలహీనం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తారకరత్న పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం విదేశీ వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గుండె, నాడీ వ్యవస్థలను యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అత్యధునిక వైద్య చికిత్సను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు
జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరారు. కుప్పం ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తారకరత్నను పర్యవేక్షించేందుకు బెంగళూరు నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఒక బృందం కుప్పం వచ్చింది. అతని పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు కుప్పం వచ్చారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (IABP) వాసోయాక్టివ్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ-డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.