AP Skill Scam: "స్కిల్ స్కామ్" కేసులో లక్ష్మినారాయణకు బెయిల్.. గంటా సుబ్బారావు ఆచూకీపై ప్రకటన చేయని సీఐడీ !
"స్కిల్ స్కామ్"లో సీఐడీ నమోదు చేసిన కేసులో రిైటర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గంటా సుబ్బారావు ఆచూకీపై సీఐడీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌లో నమోదైన కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణకు హైకోర్టు 15రోజుల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మూడు రోజుల కిందట ఆయన నివాసంలో సోదాలు చేసిన సీఐడీ అధికారులు 13వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. సీఐడీ తనిఖీలు జరుపుతుండగా ఇంట్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా విచారణకు వెళ్లలేకపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా విచారించింది. సుమారు అరగంటపాటు విచారించిన హైకోర్టు 15 రోజుల ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌పైన కూడా..
మరో వైపు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ సీఈవో గంటా సుబ్బారావును పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టలేదు. మూడు రోజులైనా సీఐడీ అధికారులు ఆయన ఆచూకీపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడంలేదు. ఆయన సమాచారం తెలియక కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆయన తల్లి అనారోగ్యంతో మంచం మీదనే ఉన్నారు. గంటా సుబ్బారావు అవివాహితుడు. ఆయన తల్లిని ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. సీఐడీ సోదాలు చేసి ఆయనను విజయవాడకు తరలించినప్పటి నుండి ఆయన ఆచూకీ తెలియడం లేదు. తమ అదుపులో ఉన్నారో లేదో కూడా సీఐడీ చెప్పడం లేదు. గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా చేర్చారు.
మరో వైపు ఈ కేసును రాజకీయ కుట్రగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించి అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్న అప్పడి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి సాక్షి సంతకాలు చేసిన వారిని వేధించడం ఏమిటని ఆరోపిస్తున్నారు. అవినీతి అనేది జరగలేదని.. ఏదైనా జరిగి ఉంటే ముందుగా ప్రేమచంద్రారెడ్డి బాధ్యత వహిస్తారని ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నారు. అయితే ప్రేమచంద్రారెడ్డి సీఎం జగన్ కు సన్నిహితులని అందుకే వదిలేశారని.. కేవలం ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని మరీ కేసులు పెట్టి వేధిస్తున్నారని అంటున్నారు. ఈ కేసులో గంటా సుబ్బారానును అరెస్ట్ చూపించిన తర్వాత కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !