Pawan Kalyan: రాజకీయ నేతలకు స్పోర్ట్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించొద్దు- డిప్యూటీ సీఎం పవన్‌ను కోరిన ప్లేయర్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఆదివారం ఆయనను కలిశారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అప్పగించవద్దంటూ వినతి పత్రాన్ని అందించారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా చేస్తామన్నారు. అదే దిశగా ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు పవన్ కళ్యాణ్ తో వరుస భేటీలు అవుతున్నారు. ఇలా కలిసిన వారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు.
క్రీడాకారుల సమస్యలు తెలుసుకున్న పవన్
కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద క్రీడాకారులు వాపోయారు. క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు ప్రస్తుతం అంగడి సరుకుగా మారిపోయినట్లు తెలిపారు. ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని పవన్ దృష్టికి తీసుకుని వచ్చారు. క్రీడా సంఘాల్లో రాజకీయ నేతల ప్రమేయం వల్ల క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందారు. తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను కొందరు రాజకీయ నేతలు అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని వివరించారు.
క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు తయారవుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని క్రీడాకారులు పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదన చెందారు. క్రికెట్ లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని, ఇదే పద్దతి అన్ని సంఘాలలో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు. క్రీడా సంఘాలలో జరుగుతున్న కొన్ని విషయాలను క్రీడాకారులు వివరించగా పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు.
రాజకీయ నేతల గుప్పిట్లో క్రీడా సంఘాలు
రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీలయ్యాయని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని ఆయన విమర్శించారు. ఏపీలో క్రీడారంగం కూడా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు, తను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. క్రీడలకు పూర్వ వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
విశ్వ విజేతలకు అభినందనలు
రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని... ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.