APSRTC: ఆర్టీసీలో ఇకపై డొక్కు బస్సులే ఉండవు.. పనులు ఊపందుకున్నాయి
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు బస్సులపై దృష్టి పెట్టంది.
ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేసుకున్న తర్వాత సంస్థ లాభనష్టాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. కొవిడ్ కారణంగా ఆర్టీసీ నష్టాలబాటలో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రయాణికుల తాకిడి పెరిగింది. మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఆర్టీసీ కూడా లాభాలబాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో డొక్కు బస్సుల సమస్య ఆర్టీసీని వేధిస్తోంది. దీనికి విరుగుడుగా ఇప్పుడు పాత బస్సులను రీ ఫర్బిషింగ్ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బస్సులకు రిపేర్ వర్క్స్ ఊపందుకున్నాయి.
ఏపీఎస్ఆర్టీసీ అనగానే ముందుగా గొర్తొచ్చేది పల్లె వెగులు బస్సులే. ఎక్కువ సంఖ్యలో ఉండేవి కూడా ఆర్డినరీ సర్వీసులే. కానీ వీటి వల్ల వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. అందుకే ఎక్స్ ప్రెస్ లు, లగ్జరీ బస్సుల మెయింటెనెన్స్ పై పెట్టిన శ్రద్ధ, పల్లె వెలుగు బస్సులపై పెట్టరు. అయితే ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకి కూడా మంచిరోజులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా ఉన్న పల్లె వెలుగు బస్సుల్లో 2వేల బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి, కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారులు. ఇందులో భాగంగా నెల్లూరు రీజియన్ లో మొత్తం 500 పల్లె వెలుగు బస్సులకు మరమ్మతులు జరుగుతున్నాయి. 270 స్పెషల్ టైప్ బస్సులకు కూడా రిపేర్ వర్కులు కొలిక్కి వచ్చాయి. పూర్తిగా కొత్త బస్సుల్లా వీటిని తీర్చిదిద్దుతామంటున్నారు అధికారులు.
కొవిడ్ తర్వాత ఆర్టీసీ ఆదాయం కూడా గణనీయంగా పెరగడం విశేషం. గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో బస్సులు నడపడం, బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో ఆదాయం పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆదాయం కూడా పెరుగుతోంది. ఒక్క నెల్లూరు రీజియన్ లోనే ఆర్టీసీ ఆదాయం 80లక్షల రూపాయలకు చేరుకోవడం విశేషం. కొవిడ్ కి ముందు నెల్లూరు రీజియన్ పరిధిలో కోటి రూపాయల ఆదాయం వస్తుండగా.. ఇప్పుడది 80లక్షల వరకు చేరుకుంది. మునుపటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అంటారే కానీ.. సౌకర్యాల విషయంలో కొన్నిసార్లు ప్రైవేటు బస్సులతో పోటీ పడలేరు. పల్లెటూరి రూట్లలో ప్రైవేటు పోటీ లేదు కాబట్టి ఆర్టీసీయే అందరికీ ఏకైక ప్రత్యామ్నాయం. బస్సులు రిపేర్ కి వచ్చినా వాటినే తీసుకెళ్లేవారు ఇన్నాళ్లూ. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పల్లెవెలుగు బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతుండటంతో.. వాటి ఫిట్ నెస్ పై దృష్టిపెట్టారు అధికారులు. ఇకపై ఆర్టీసీలో డొక్కు బస్సులే ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు సంస్థను కూడా గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్