APPSC: త్వరలో గ్రూప్-1 ఫలితాలు.. వారంలో ఆ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ మూల్యంకనంపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వివరణ ఇచ్చారు. త్వరలో ఫలితాలు వెళ్లడించనున్నట్టు తెలిపారు.
త్వరలో గ్రూప్-1 ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలపై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఏపీపీస్సీ కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మాన్యువల్‌గానే మూల్యంకనం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు డిజిటల్ మూల్యంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదని వెల్లడించారు. ముందే నోటిఫికేషన్‌లో చెప్పనందుకు హైకోర్టు తప్పుబట్టిందని పేర్కొన్నారు. డిజిటల్ వాల్యువేషన్ పారదర్శకంగా జరిగిందని ఆంజనేయులు అన్నారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని సూచనలు వచ్చినా తాము ఒప్పకోలేదని ఆంజనేయులు వివరించారు. 3 నెలల్లో మూల్యంకనాలు పూర్తి చేసి ఫలితాలిస్తామని తెలిపారు. 190 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో 670 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఆంజనేయులు వివరించారు.
గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారని పిటిషన్ లో చెప్పారు. ఈ కారణంగా ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని వాదించారు.
నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ. ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే తాజాగా వాదనలు విన్న ధర్మాసనం 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించింది.
గ్రూప్ -1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల్ని చేతితో దిద్దాలని.. ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ గతంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూలకు పిలవాలని, ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొంది.
Also Read: SSC Recruitment 2021: టెన్త్ విద్యార్హతతో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..