Breaking News Live Updates: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. హుటాహుటిన తరలి వచ్చి.. మంటలను ఆర్పేశాయి.
బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని కళ్లకురిచిలోని శంకరాపురం బాణసంచా కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, మరో 10 మంది వరకు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
కర్నూలులో రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత
వినూత్న రీతిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని కర్నూలు సెబ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు కర్నూలు సెబ్ అధికారి భరత్ నాయక్ తెలిపారు. కర్నూలు ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే 732 మద్యం బాటిల్స్ పట్టుకున్నామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారి భరత్ హెచ్చరించారు.
ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్
ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిలో ఇద్దరికి బెయిల్ మంజూరైంది. ముంబయిలోని ఎన్‌డీపీఎస్ కేసుల విచారణ చేస్తున్న ప్రత్యేక న్యాయస్థానం మనీశ్ రాజ్‌గారియా, అవిన్ సాహూలకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ కూడా ఇదే కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యారు. అక్టోబర్ 2న ఎన్సీబీ దాడి చేసిన క్రూజ్ నౌకలో వీళ్లు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో పాటు 20 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ఇటీవల ఆర్యన్‌కు ఈ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్యన్ సహా అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచా బెయిల్ పిటిషన్లపై వాదనలు విననుంది.
హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదం... 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు
హుజూరాబాద్ మండలం రాజపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. టాటా ఏస్‌లో మొత్తంగా 20 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన మంత్రి గంగుల కమలాకర్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రాణనష్టం జరగకుండా మెరుగైన వైద్య సదుపాయాల కల్పించాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
నటి సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట... కంటెంట్ తొలగించాలని ఆదేశాలు
కూకట్‌పల్లి కోర్టులో సమంతకు ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే ఆ కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో తన పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్‌పల్లి కోర్టు విచారించింది. రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.