(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: నెల్లూరులో దారుణం, విద్యార్థిని గొంతు కోసి యాసిడ్ దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నాగర్ కర్నూలు జిల్లా తెలకపెల్లిలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం చెందారు. తెలకపల్లిలో నివాసముంటున్న భోగారాజు భద్రయ్య (65)భోగరాజు వెంకటమ్మ (60) వృద్ధ దంపతులు. రోజు మాదిరిగానే భోజనం చేసి ముందు రూములో పడుకున్నారు. కొడుకు కోడలు వెనక రూములో పడుకున్నారు. ఇద్దరు పిల్లలు వినాయక విగ్రహం దగ్గరికి వేడుక చూసేందుకు వెళ్లారు. అయితే నిన్న సాయంత్రం నుండి వర్షం నిరంతరంగా కురవడంతో మట్టి మిద్దె పూర్తిగా తడిచింది. మధ్య రాత్రి 12 గంటలకు రూము పూర్తిగా తడిచి కుప్ప కూలి వృద్ధ దంపతులపై పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మధ్య రాత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కలిసి మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు కోడలు మరో రూంలో పడుకోవడం, మనువళ్లు ఇద్దరూ వినాయక విగ్రహం దగ్గరికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మట్టి ఇళ్ల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తక్షణమే మట్టి ఇల్లు, పాత ఇల్లు ఖాళీ చేసి మరో ఇళ్లకు మారాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తమై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. గ్రామంలో చాటింపులు వేసి ప్రజలను అప్రమత్తం చేసి చేయాలని కూడా ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు లేక వాతావరణం వేడెక్కుతోంది. నేటి నుంచి కొన్నిరోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో వర్షాలు, ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన ఉంది. ఆగస్టు 9 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఈ మేరకు ఆగస్టు 9 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆదివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమలో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
నెల్లూరులో దారుణం, విద్యార్థిని గొంతు కోసి యాసిడ్ దాడి
నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని గొంతుకోసి యాసిడ్ దాడి చేశారు దుండగులు. నెల్లూరు నక్కలకాలనీలో ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దేశ రైతులందరికీ ఉచిత విద్యుత్- నిజామాబాద్‌లో కేసీఆర్ ప్రకటన
నిజామాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ప్రధానమంత్రి మోదీని ప్రశ్నిస్తున్నాను.. నాన్‌పర్సార్మర్ అసెట్స్ కింద ఎన్పీఏల కింద కేంద్రం దోచిపెట్టిన సంపద పన్నెండు లక్షల కోట్లు. భారత్‌లో కరెంటు ఉత్పత్తి అవుతుందో.. దాంట్లో రైతులు వాడుకునేది 20.8శాతమే. ధాని ధర ఒక లక్షల నలభై ఐదు కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసిన వాళ్లకు వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్లకు కమీషన్లు తీసుకొని పన్నెండు లక్షల కోట్లు మాఫీ చేసినావే... లక్ష కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని అడుగుతున్నాను. భారత్‌దేశమంతటా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండా మాత్రమే ఎగురుతుంది. పేదల, రైతుల, కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. దిల్లీ గద్దెపై మన ప్రభుత్వం రాబోతోంది. వచ్చే ఎన్నికల్లో వచ్చే బీజేపీ ముక్త భారత్. దేశంలోని రైతులందరికీ తీపి కబురు చెప్తున్నాను. తమ ప్రభుత్వం వస్తే దేశంలోని రైతులందరికీ ఉచితి విద్యుత్ ఇస్తాం" అని కేసీఆర్ అన్నారు.
KTR: కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్
- కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్
- కరోనా బారిన పడిన మంత్రి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు
- ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్థారణ
- రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
Vikarabad News: వికారాబాద్ మున్సిపల్ సమావేశం రసాభాస
వికారాబాద్ మున్సిపల్ సమావేశంలో నేడు గందరగోళం నెలకొంది. సొంతపార్టీ చైర్‌పర్సన్ మంజులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అగ్రిమెంట్ ప్రకారం పదవి నుంచి దిగిపోవాలని పట్టుపట్టారు. దీంతో ఛైర్ పర్సన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మీకు ఏదైనా ఉంటే బయట చూసుకొండి.. ప్రజా సమస్యలపై చర్చ జరపాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది.
Tirumala News: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అపోలో హాస్పిటల్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, సినీ హాస్య నటుడు బ్రహ్మానందం వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.