Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు సీసీఎస్ కు బదిలీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
మార్చి 18 వరకు మధ్య, దక్షిణ భారతదేశంలో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి
వర్షాలతో పాటు పిడుగులు, ఉరుములు, భారీ ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా ఈసారి పడనున్నాయి. తేమ పొడిగాలుల కలయిక వలన భారీ ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండనుంది. మార్చి 16 న తెలంగాణలో వర్షాలు పెరుగుతాయి. మార్చి 16 రాత్రి సమయం నుంచి తెలంగాణ తూర్పు భాగాలతో పాటుగా ఎన్.టీ.ఆర్., ఏలూరు, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను మనం చూడగలం. మార్చి 17 నుంచి తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా జిల్లాలైన ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులు ఉండనున్నాయి. మిగిలిన జిల్లాలైన తిరుపతి, కడప, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలను చూడగలం. ఇది మార్చి 17 నుంచి 20 వరకు అక్కడక్కడ నమోదవుతూ వస్తుంది. అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఈ నెల 16 నుంచి తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటాయని అంచనా వేశారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మార్చి 16 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది. గాలులు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయని, దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా
ఢిల్లీలో వేడిగాలులు మెల్లగా పెరుగుతున్నాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది సీజన్ సగటు కంటే ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది, ఇది ఇప్పటివరకు సీజన్‌లో అత్యంత వేడిగా ఉండే రోజు ఇదే అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి కాలం మార్చి 1 నుంచి ప్రారంభమై మే 31 వరకు ఉంటుందని IMD అధికారి తెలిపారు. IMD శాస్త్రవేత్త కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఢిల్లీలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో హాటెస్ట్ డే ఇదని తెలిపారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు సీసీఎస్ కు బదిలీ
TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు సీసీఎస్ కు బదిలీ
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది. అంతకుముందు అన్ని నియామక బోర్డులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
AP Assembly Schedule: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే షెడ్యూల్
- 14.03.2023 మంగళ వారం
గవర్నర్ గారి ప్రసంగం
BAC మీటింగ్ - 15.03.2023 బుధవారం
గవర్నర్ గారికి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం - 16.03.2023 గురువారం
బడ్జెట్ ప్రవేశం - 17.03.2023 శుక్రవారం
అసెంబ్లి బిజినెస్ - 18.03.2023 శని వారం
అసెంబ్లి బిజినెస్ - 19.03.2023 ఆది వారం
సెలవు - 20.03.2023 సోమవారం
అసెంబ్లి బిజినెస్ - 21.03.2023 మంగళ వారం
అసెంబ్లి బిజినెస్ - 22.03.2023 బుధవారం
ఉగాది పండుగ సెలవు - 23.03.2023 గురు వారం
MLA ల కోటాలో MLC ల ఎన్నికలు - 24.03.2023 శుక్ర వారం
అసెంబ్లి బిజినెస్
కర్నూలులో డబుల్ మర్డర్- నవ వధువు దారుణ హత్య
కర్నూలు జిల్లా కల్లూరులో డబుల్ మర్డర్ కలకలం రేపింది. రెండు వారాల క్రితమే వివాహం జరిగింది. నవ వధువును భర్త, మామ కలిసి హత్య చేశారు. బాధితులది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిగా గుర్తించారు.
Medchal News: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డబిల్ పూర్ గ్రామానికి చెందిన రమేష్ (55) ద్విచక్ర వాహనంపై మేడ్చల్ కు వస్తుండగా వెనక నుండి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
AP Assembly Latest News: ముగిసిన బీఏసీ మీటింగ్, 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను 9 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. 16న సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం కారణంగా ఈ నెల 19, ఉగాది సందర్భంగా 22న సెలవు ఉండనుంది. ఈ నెల 24తో సమావేశాలు ముగియనున్నాయి.