Breaking News Live Telugu Updates: విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
బంగాళాఖాతంలోని నైరుతి భాగంలో మొన్న (నవంబరు 9) ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్ప పీడనంగా మారింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఇది ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని, తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని అంచనా వేశారు. అయితే, దీని ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉండగా ఏపీలో కాస్త తక్కువగా ఉండనుందని అధికారులు చెప్పారు.
దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన
ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం (నవంబరు 11), శనివారం రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతోపాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర - తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో అధికారుల హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీవ్ర పెనుగాలులు, భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ గురువారం (నవంబరు 10) ఓ ప్రకటనలో హెచ్చరించారు. లోతట్టుప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా..
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30.0 డిగ్రీలు, 17.5 డిగ్రీలుగా నమోదైంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం జగన్, గవర్నర్ బిశ్వ భూషణ్ స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- స్పాట్‌లోనే ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, కాణిపాకం పట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు ఢీ కొట్టింది. ఈదుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి స్పాట్‌లోనే చనిపోయారు. వారంతా బెంగుళూరు నుంచి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పాల ట్యాంకర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టడం వల్ల కారు అందులోకి దూసుకెళ్లిపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి అతి కష్టమ్మీద కారును బయటకు తీశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి గంగుల కమలాకర్ శ్వేతా గ్రానైట్స్ లో ఈడీ సోదాలు, రూ.కోటి 8 లక్షలు సీజ్
మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేతా గ్రానైట్స్ లో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. పనామా పేపర్స్ నిందితుల ఖాతాల్లో శ్వేత గ్రానైట్స్ కు సంబంధం ఉందని తెలిపింది. శ్వేత సంస్థకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, కరీంనగర్ లో సోదాలు చేశామని ఈడీ తెలిపింది. ఎగుమతికి బినామీ ఖాతాలు వినియోగించారని తెలిపింది. హవాలా ద్వారా డబ్బు వచ్చినట్లు గుర్తించామన్నారు ఈడీ అధికారులు. ఎగుమతి చేయకుండా నగదు లావాదేవీలు జరిగాయన్నారు. సోదాల్లో రూ.కోటి 8 లక్షలు సీజ్ చేశామని తెలిపారు.
Supreme Court: రిషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ
విశాఖపట్నంలో రిషికొండ తవ్వకాల అంశంపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ఇప్పటికే హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఏదన్నా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ప్రతీ విషయం సుప్రీంకోర్టులో తేల్చుకోవాలంటే ఎలా అని ప్రశ్నించింది. కాబట్టి, పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని తేల్చి చెప్పింది. అయితే, పిటిషన్ ను విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా, అందుకు ధర్మాసనం అంగీకరించింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య, ఈ మార్గంలో నిలిచిన రైళ్లు
హైదరాబాద్ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. దాదాపు అర గంట నుంచి రైలు ఎటూ కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆగిపోవడానికి గల కారణాలను సిబ్బందిని అడిగితే, పంజాగుట్ట - ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టేషన్ల మార్గంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిపారు. కాబట్టి, ఎల్బీ నగర్ - మియాపూర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అరగంట నుంచి ఇదే పరిస్థితి ఎదురు కావడంతో ప్రయాణికులు స్టేషన్ నుంచి కిందకి దిగి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.