AP Heat Wave : ఏపీ ప్రజలకు అలెర్ట్, రేపు 116 మండలాల్లో వడగాల్పులు!
AP Heat Wave : ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రేపు(సోమవారం) 116 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
AP Heat Wave : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఐఎండీ అంచనాల మేరకు సోమవారం 116 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(116) :
- అల్లూరి జిల్లా - 7 మండలాలు
- అనకాపల్లి జిల్లా - 15 మండలాలు
- తూర్పుగోదావరి జిల్లా - 8 మండలాలు
- ఏలూరు జిల్లా - 4 మండలాలు
- గుంటూరు జిల్లా - 6 మండలాలు
- కాకినాడ జిల్లా - 9 మండలాలు
- కృష్ణా జిల్లా - 6 మండలాలు
- నంద్యాల జిల్లా -4 మండలాలు
- ఎన్టీఆర్ జిల్లా 15 మండలాలు
- పల్నాడు జిల్లా- 2 మండలాలు
- పార్వతీపురంమన్యం జిల్లా -10 మండలాలు
- శ్రీకాకుళం జిల్లా - 3 మండలాలు
- విశాఖపట్నం జిల్లా 1 మండలం
- విజయనగరం జిల్లా- 13 మండలాలు
- వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
- ఆదివారం అనకాపల్లి 11, కాకినాడ 3, విజయనగరం3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయగా.. 100 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
తెలంగాణలో వానలు
తూర్పు విదర్భ నుండి ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీనివల్ల రాగల రెండు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC చుట్టు పక్కల జిల్లాలలో 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మీ)తో 4, 5 జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.