AP News: ఏపీలోని వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు - 15 లక్షల రూపాయల ఫీజు
AP News: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి 17 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నారు. అందులో 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
AP News: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన 17 వైద్య కళాశాలల ప్రవేశాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ప్రవేశాలు, సీట్ల కేటాయింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు అంటే దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ సీట్ల కోసం పోటీ పడొచ్చు. మిగిలిన సీట్లను మూడు విభాగాలుగా విభజించారు. వాటిలో 50 శాతం సీట్లను జనరల్ విభాగంలో కేటాయించనున్నారు. మిగతా వాటిలో 35 శాతాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ కొత్తగా క్రియేట్ చేసి ఇస్తున్నారు. 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయబోతున్నారు.
జనరల్ విభాగంలో సీటు దక్కించుకున్న వారు ఏడాదికి రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్‌లో సీటు పొందిన వాళ్లు మాత్రం రూ.12 లక్షలు సమర్పించుకోవాలి. ఎన్ఆర్ఐ విబాగంలో రూ.20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు.
మిగిలిన ఏడు కాలేజీలు అప్పుడే ప్రారంభం
నాడు నేడు కార్యక్రమం కింద రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.3,820 కోట్లు వెచ్చించారు. ఇలా మొత్తం రూ.12,300కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఖర్చు చేయనున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనప్లలె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలు అన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025-26లో ప్రారంభించాలని నిర్ణయించారు.