AP Capital Issue : ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా జగన్ పాలన ! నైతికమేనా ? సమర్థించుకోగలరా ?
రాజధానిపై ఎటూ తేలకపోయినా విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారని మంత్రులు ప్రకటిస్తున్నారు. సీఎం ఇలా చేయడం నైతికమేనా ? సమర్థించుకోగలరా ?
AP Capital Issue : 2023 ఏప్రిల్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. అలా అయితే విశాఖ రాజధాని అయినట్లేనా అంటే మాత్రం చట్ట పరంగా కాదని చెప్పాలి. అయితే సీఎం ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చని.. ఫలానా చోటే ఉండాలన్న రూలేం లేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కొంత కాలంగా వాదిస్తున్నాయి. అదే సమయంలో రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదని అంటున్నారు. ఈ వాదనలతో.. సుప్రీంకోర్టులో అమరావతి అంశం తేలకపోయినా విశాఖ నుంచి జగన్ పాలన చేయాలని నిర్ణయించుకున్నారు. పై స్థాయి అనుమతి లేదని మంత్రి అమర్నాత్ ఈ ప్రకటన చేయరు. మరి జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అవుతుందా ? వ్యవహారం కోర్టుల్లో ఉన్నప్పుడు ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత అలా చేయవచ్చా ?
విశాఖకు సీఎం క్యాంపాఫీస్ మార్పుపై కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ మంత్రుల సంకేతాలు ?
విశాఖలో సీఎం క్యాంపాఫీస్ ఉంటే తప్పేమిటని.. ఆయన ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చని కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు ప్రకటనలు చేస్తున్నారు. రుషికొండ వివాదాస్పద తవ్వకాలు సీఎం క్యాంప్ ఆఫీసుకోమేనన్న ప్రచారం ఉంది. అయితే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ఓ సారి ప్రశ్నించారు. ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు గతంలో కూల్చివేసిన భవనాలు ఎంత మేర ఉన్నాయో...ఇప్పుడు కూడా ఆ నిర్మాణాలున్నచోటే కట్టాలని ఆదేశించింది. కానీ ఇటీవల సీపీఐ నేత నారాయణ ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు... పెద్ద స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. అవన్నీ సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని భావిస్తున్నారు. అక్కడ నిర్మాణాలు ఏప్రిల్ కల్లా పూర్తయిపోతాయని ... ఆ తర్వాత జగన్ అక్కడి నుంచి పరిపాలిస్తారని చెబుతున్నారు. తాజాగా గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రకటన కూడా దీనినే సూచిస్తోంది.
రిట్ ఆఫ్ మాండమస్‌పై స్టే ఇవ్వని హైకోర్టు - రాజధానిపై చట్ట పరంగా ముందుకెళ్లే చాన్స్ లేనట్లే !
సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే రాలేదు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నట్లుగా ఫలానా తేదీలోపు కట్టివ్వాలన్న అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికైతే అమరావతే రాజధాని. సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తదుపరి విచారణ జనవరి 31న జరుగుతుంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ అయ్యాయి. అందరి వాదనలు వినాలి. అందుకే ఈ కేసు విచారణ సుదీర్గంగా జరుగుతుందని న్యాయనిపుణులు అంచనా వస్తున్నారు. కేంద్రం సహా అన్ని పక్షాలు తమ వాదనలు వినిపించాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించడానికి అవకాశం లేదు. అలా చేస్తే కోర్టు తీర్పు ఉల్లంఘన అవుతుంది.
సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చు..ఎవరూ ఆపలేరు !
అయితే వైఎస్ఆర్‌సీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారు. విశాఖలో ఏప్రిల్ నుంచి రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. సీఎం క్యాంపాఫీస్‌గా మార్చుకుని పాలన సాగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో తాము వాదించినట్లుగా..సీఎం పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని.. ఎవరూ అడ్డుకోలేరని వారు వాదించవచ్చు. వైఎస్ఆర్‌సీపీ నేతల వాదన కరెక్టే. సీఎం జగన్ రాజధాని నుంచే పరిపాలించాలని లేదు. అలాగని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు. సీఎం జగన్ కర్నూలు లేదా విశాఖ నుంచి పరిపాలన చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఈ కోణంలోనే విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయవచ్చు.
జగన్ అలా విశాఖ నుంచి పాలన చేయడం నైతికంగా విమర్శలకు గురయ్యే అవకాశం!
రాజధాని అంశం న్యాయస్థానాల్లో ఉంది. తేలకుండా సీఎం జగన్.. తనకు తాను విశాఖ వెళ్లిపోయి .. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తే నైతికంగా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. ఓ ముఖ్య మంత్రిగా ఉండి వ్యవస్థల్ని గౌరవించడం లేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి అలా వెళ్లదల్చుకుంటే.. ఏప్రిల్ వరకూ అవసరం లేదు.. రేపే వెళ్లి ఎక్కడో చోట కూర్చుని పనులు చేసుకోవచ్చు. పరిపాలించవచ్చు. అలా చేయడం నైతికమా ? కాదా ? అన్న ప్రశ్న ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే వైఎస్ఆర్‌సీపీ వర్గాలు.. సమర్తించుకునేందుకు వాదనలు సిద్దం చేసుకున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ... స్థానిక ఎన్నికలలో విజయమే.. తమ మూడు రాజధానుల విధానానికి ప్రజల మద్దతు లభించిందనడానికి సాక్ష్యమంటున్నారు. ఇదే వాదన ముందు ముందు బలంగ వినిపించే అవకాశం ఉంది.