Minister Kannababu: సినిమా టికెట్ల ధరలు నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత... అశోక్ గజపతి రాజు దైవాంశ సంభూతులా?... మంత్రి కన్నబాబు ఫైర్
రామ తీర్థంలో అశోక్ గజపతి రాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు... ఇవాళ రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై సినీ హీరో నాని వ్యాఖ్యలపై మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదన్నారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందన్నారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అన్న ఆయన... సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రెచ్చగొట్టే ధోరణిలో అశోక్ గజపతి రాజు తీరు
రామతీర్థం ఘటనపై మాట్లాడిన మంత్రి కన్నబాబు... అశోక్ గజపతి రాజు ఏమైనా దైవాంశ సంభూతులా అని ఆరోపించారు. గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి మాట్లాడారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఎంతవరకు సరైందన్నారు. అశోక్ గజపతి రాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం, తిరిగి తమపై ఆరోపణలు చేస్తున్నామన్నారు. అశోక్ గజపతి రాజు కోసం అధికారులు ప్రొటో కాల్ ను పాటించారన్నారు. 40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఉత్తర కుమారుడిలా లోకేశ్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు
రైతుల ఆత్మహత్యలను దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు పరిపాలన కన్నా వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. ఏపీలో జరిగే వ్యవసాయాభివృద్ధిపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఏపీలో వ్యవసాయాభివృద్ధి బాగుందని నీతి ఆయోగ్ కితాబిచ్చిందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే, చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రోజే రైతు పక్షపాతినని సీఎం జగన్ ప్రకటించారన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్న ఆయన... రాష్ట్రం వ్యవసాయాభివృద్ధిలో 9.3 శాతం వృద్ధి రేటుతో జాతీయ వృద్ధి రేటు కంటే ముందుందన్నారు. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని వైఎస్ఆర్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారని, కానీ వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి