AP Inter 2021 Results: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..
AP Inter 2021 Results: ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు.
ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి మార్కులకు 30 శాతం (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు).. ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించినట్లు వెల్లడించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన, పరీక్షలకు హాజరు కాకపోయిన విద్యార్థులందరినీ కూడా కనీస పాస్ మార్కులతో (35 శాతం) పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మార్కుల కేటాయింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు..
1. http://examsresults.ap.nic.in
2. http://bie.ap.gov.in
3. https://results.bie.ap.gov.in/
4. https://results.apcfss.in/
సుప్రీంకోర్టు సూచనలతో..
తొలుత వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించి తీరతామనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జూన్ 25న ప్రకటించింది.
హైపవర్ కమిటీ ఏర్పాటు..
అనంతరం ఫలితాలు వెల్లడికి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మార్కులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10,32,469 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది కాగా.. సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.
మార్కుల కేటాయింపు ఇలా..
- పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టులవారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లను కేటాయించింది.
- ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 2019లో టెన్త్, 2020లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ రెండింటినీ కలిపి సెకండియర్ మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది.
- టెన్త్ మార్కులకు 30 శాతం వెయిటేజీ (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకుంటారు).. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సాధించిన అన్ని మార్కులను కలిపి 70 శాతం వెయిటేజీ తీసుకొని మొత్తం 100 శాతానికి మార్కులు కేటాయించింది.