Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యాదీవెనపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో ఫీజు రియింబర్స్ మెంట్ వేయాలని గతంలో తేల్చిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. తల్లుల ఖాతాల్లో నగదు జమపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం రివ్యూ పిటిషన్ కొట్టేస్తూ సోమవారం తుది తీర్పు ఇచ్చింది. విద్యాదీవెన పథకం కింద ఇచ్చే నగదును తల్లుల ఖాతాల్లో కాకుండా విద్యాసంస్థల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !
వైఎస్ పథకానికి మార్పులు
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం స్థానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా గతంలో విద్యాసంస్థలకు ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నిర్ణయంపై విద్యాసంస్థల యాజమాన్యాలు ముందునుంచే అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. కానీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ను తల్లుల ఖాతాల్లోనే జమచేయడం ప్రారంభించింది.
Also Read: పవన్ ను ప్రజలు రిజెక్ట్ చేశారు... ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునిరేషన్ ఎంత?... అంబటి రాంబాబు ఫైర్
తల్లుల ఖాతాల్లో వేయవద్దని హైకోర్టు తీర్పు
జగనన్న విద్యాదీవెన పేరుతో ప్రభుత్వం విద్యార్థుల కోసం చెల్లించాల్సిన ఫీజుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో వేయడం, ఆ నగదు కొందరు దుర్వినియోగం చేయడంతో కాలేజీలు కోర్టుకెక్కాయి. తమకు ఇవ్వాల్సిన ఫీజులు ఎవరిస్తారో చెప్పాలని ప్రశ్నించాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన ఫీజుల్ని తల్లులకు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. జగనన్న విద్యాదీవెన పథకంలో ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను తల్లుల ఖాతాల్లో వేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం ఇకపై కాలేజీల ఖాతాల్లోనే నగదును వేస్తోందని అంతా భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం తల్లులకు సూచించింది. అలా చెల్లించని వారికి మరో విడత ఫీజులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. మూడో విడత విడుదల చేసిన ఫీజుల్ని కూడా ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోనే వేసింది.
Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?