(Source: ECI/ABP News/ABP Majha)
AP High Court : సీఎం జగన్ సభకు పిల్లల తరలింపుపై పిటిషన్ - నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
సీఎం జగన్ సభలకు పిల్లల తరలింపుపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని జడ శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
AP High Court : అమ్మఒడి కార్యక్రమానికి స్కూల్ పిల్లలను తరలించడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అనుమతించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేసుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం విచారించింది. ధర్మాసనం ముందు న్యాయవాది జడ శ్రావణ కుమార్ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న సభకు పిల్లలను తరలించడం చట్టవిరుద్ధమని ధర్మాసనానికి తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని శ్రావణ కుమార్ వాదించారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేసుగా విచారణ జరిపిన కొత్త చీఫ్ జస్టిస్
పిల్లలను తరలించిన అంశాన్ని విద్యాశాఖ అధికారి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిన వివరాలను న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిల్లల్ని తరలించిన విషయాన్ని అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థులను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించి వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తీర్పు ను న్యాయవాది శ్రావణ కుమార్ కోర్టుకి గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలకు బటన్లు నొక్కేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇందులో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తో పాటు విద్యా కానుక వంటి పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్తున్నారు. అవి చిన్నారులకు సంబంధించినవి కాబట్టి వివిధ స్కూళ్లు, పాఠశాలల నుంచి విద్యార్థులను కూడా తరలిస్తున్నారు.
పిల్లలు ఎదురుగా ఉన్న రాజకీయ విమర్శలు చేస్తున్న సీఎం జగన్
అవడానికి పథకాలకు బటన్లు నొక్కే కార్యక్రమమే అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఇవే హైలెట్ అవుతున్నాయి. కురుపాంలో నిర్వహించిన అమ్మఒడి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నాలుగు పెళ్లిళ్లు, పెళ్లాం, పిల్లలు అంటూ మాట్లాడారు. చిన్న పిల్లల ముందు ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం ఏమిటన్న అభిప్రాయం అప్పుడే వినిపించింది. అసలు ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు చిన్న పిల్లలను తరలించవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఉండటంతో జడ శ్రవణ్ కుమార్ కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగా ఆయన ముందుగానే అధికారుల నుంచి పిల్లల్ని తరలించామన్న సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకోవడంతో పిటిషన్‌కు బలం చేకూరినట్లయింని భావిస్తున్నారు.
విచారణ కీలకంగా మారే అవకాశం
ఒక్క కురుపాం సభకే కాకుండా విద్యా రంగ పథకాలకు సంబంధించిన పథకాలకు బటన్లు నొక్కే కార్యక్రమాలన్నింటికీ పిల్లల్ని తరలిస్తున్నారు. ఇది తరచూ విమర్శలకు గురవుతోంది. హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కానీ.. సంచలనం అయ్య అవకాశాలు ఉన్నాయన ిఅంచనా వేస్తున్నారు.