SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ లీకేజీ కేసు, నారాయణ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్
SSC Paper Leakage Case : పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంలో హైకోర్టుకు చేరింది. ఈ కేసులో తమపై పోలీసుల చర్యలు నివారించాలని నారాయణ కుటుంబ సభ్యులు, విద్యా సంస్థ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.
SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు, విద్యాసంస్థకు చెందిన కొందరికి హైకోర్టులో ఊరట లభించింది. నారాయణ విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. వీరి విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ చేసి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కోర్టులో విచారణ
పేపర్ లీకేజీ విషయంలో చిత్తూరు జిల్లా డీఈవో ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిత్తూరుకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు బెయిలు మంజూరైంది. ఈ కేసులో తమను అరెస్టు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, విద్యా సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎస్.ప్రణతి, జి.బసవేశ్వర వారి తరఫున కోర్టులో పిటిషన్లు వేశారు. సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి దిగువ కోర్టు బెయిలిచ్చిందని తెలిపారు. పిటిషనర్లకు మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంతో అసలు సంబంధం లేదన్నారు. వాస్తవానికి ఈ కేసులో పిటిషనర్లు నిందితులు కారని తెలిపారు.
18వ తేదీ వరకు చర్యలొద్దు
ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్లు నిందితులు కానప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్లు నిందితులు కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడంవల్ల కలిగే నష్టం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈనెల 18 వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
అసలేం జరిగింది?
పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను గత మంగళవారం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తీసుకొచ్చారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి తెలుగు పేపర్ వాట్సప్ ద్వారా బయటకు వచ్చంది. ఈ ఘటనలో నారాయణ పాత్ర ఉన్నట్టు నిర్థారించి ఆయన్ను అరెస్టు చేశామని చిత్తూరు పోలీసులు వివరించారు.