Narayana CID : సీఐడీ ఆఫీస్‌కు వెళ్లకుండా నారాయణకు ఊరట - హైకోర్టు ఏం చెప్పిందంటే ?
మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన భార్యను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని సీఐడీనిహైకోర్టు ఆదేశించింది.
Narayana CID : మాజీ మంత్రి నారాయణ పై నమోదయిన అమరావతి ప్రాంత మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నారాయణను, ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలను ఇంటి దగ్గరే విచారించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు లో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరిపై సీఐడీ కేసులు చేసింది. ఈ కేసు విచారణకు ఈ నెల 6న నారాయణ దంపతులు సహా కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులిచ్చింది. ఈ నోటీసుపపై నారాయణ హైకోర్టుకు వెళ్లారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని అలాగే నారాయణను ఇంటి దగ్గరే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిని ఇంటి దగ్గరే విచారించాలని హైకోర్టు ఆదేశించింది.
నారాయణపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల !
మాజీ మంత్రి నారాయణ, అప్పటి మంత్రులు, వారి బినామీలు రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అసైన్డ్ భూములను లాక్కొన్నారని సీఐడీ అధికారులు కేసు పెట్టారు. ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారని తెలిపింది. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా పొందేందుకు 2016లో ఎం.ఎస్.నెం.41 జీఓ జారీ చేశారని ఏపీ సీఐడీ చెబుతోంది.
సీఐడీ ఆరోపణలు ఇవీ !
'కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, మంత్రుల కుటుంబ సభ్యులు పథకం ప్రకారం అప్పటి మంత్రుల బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. నిషేధిత జాబితాలోని భూములపై రిజిస్ట్రేషన్లు, జీపీఏలు అనుమతించాలంటూ మంగళగిరి సబ్ రిజిస్ట్రార్, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ స్కాంలో పొంగూరు నారాయణ ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ స్థాపించిన నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామ నారాయణ ట్రస్ట్ ల నుంచి జూన్, 2014 నుండి డబ్బును రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి తరలించారని సీఐడీ ఆరోపిస్తోంది.
పలుమార్లు నారాయణ ఇళ్లల్లో తనిఖీలు!
పలుమార్లు నారాయణ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. మాదాపూర్ లోని NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా పి.నారాయణ కుమార్తె, అల్లుడు ఉన్నారు. NSPIRA సంస్థ నారాయణ గ్రూప్ లోని అన్ని పాఠశాలలు, కళాశాలల నిర్వహణ, మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలు మొదలైన వాటి కోసం చెల్లింపులు చేస్తుంది. నారాయణ గ్రూప్‌లోని అన్ని పాఠశాలలు కళాశాలల అవసరాలు, ఈ లావాదేవీలపై కమిషన్‌లను పొందుతుంది. ఈ NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సోదాలు కూడా చేశారు. నారాయణ కుమార్తెల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఆ ఆడియో క్లిప్ దొరికినట్లుగా మీడియాకు లీక్ చేశారు.