AP Capital Issue: ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్! 3 రాజధానులపై ఏపీ హైకోర్టు తుది తీర్పు వెల్లడి
3 Capitals Issue: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది.
AP High Court Verdict: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల (AP 3 Capitals) విషయంలో జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు (AP High Court) భారీ షాక్ ఇచ్చింది. గురువారం (మార్చి 3) మూడు రాజధానులు, సీఆర్డీఏ (CRDA) రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్‌ను (AP Capital Planning) వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని.. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
అమరావతిని రాజధానిగా (Amaravati) అభివృద్ధి చేయాలని ఆదేశించింది. 6 నెలల్లోపు ఆ ప్రాంతంలో ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని (CRDA Act) రద్దు చేయలేరని గుర్తు చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని.. పిటిషనర్లు అందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
విచారణ జరిగింది ఇలా..
ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల (AP 3 Capitals) అంశం ప్రకటించిన అనంతరం.. ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, 3 రాజధాను చట్టాలను తీసుకొచ్చింది. వాటిని సవాలుచేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులతో (Amaravati Farmers) పాటు ఇంకొందరు ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై విచారణ జరుగుతూ ఉండగానే ఆ చట్టాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. అయితే, ప్రభుత్వం 3 రాజధానుల చట్టాన్ని రద్దు చేసినప్పటికీ, ఇంకా తాము దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని అంశాలపై ఎలాంటి స్పష్టతా లేదని వాటిపై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిటిషన్లు ఏపీ హైకోర్టును కోరారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని వారు కోర్టును అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తరపున న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా కోర్టును అభ్యర్థించారు. 3 రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున దీనిపై హైకోర్టులో ఉన్న పిటిషన్లన్నింటిపై ఇక విచారణ అవసరం లేదని వాదించారు. మొత్తానికి వరుసగా విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (AP High Court) ఫిబ్రవరి 4న ఈ పిటిషన్లపై విచారణ ముగించి.. తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించింది.