Raghurama CID : హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !
రఘురామను ప్రశ్నించడానికి ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లో లాయర్ సమక్షంలో ప్రశ్నించాలని స్పష్టం చేసింది.
Raghurama CID : రఘురామకృష్ణరాజుపై సీఐడీ నమోదు చేసిన సుమోటో కేసుల్లో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ కేసుల్లో నమోదు చేసిన రాజద్రోహం సెక్షన్ మినహా ఇతర సెక్షన్లపై విచారణ జరపవచ్చని తెలిపింది. సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని రఘురామరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ కేసులో విచారణ జరపాల్సి ఉందని సీఐడీ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్‌ల కింద విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అయితే సీఐడీ అధికారులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని వారి నుంచి ప్రాణహాని ఉందని రఘురామకృష్ణరాజు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. గతంలో విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను హైదరాబాద్‌లో చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.
రఘురామ కృష్ణరాజు ఒక పథకం, ప్రణాళిక ప్రకారం కులాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించినట్టు సీఐడీ ఆరోపిస్తూ ‘ఐపీసీ సెక్షన్ 124 (ఏ), 153, 505 రెడ్‌విత్ 120బీ సెక్షన్ల కింద సీఐడీ పోలీసుస్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 12/2021 కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు చేసింది కూడా సీఐడీ దర్యాప్తు అధికారి విజయ్ పాల్. ఆయన బృందమే అరెస్ట్ చేసింది. కేసు నమోదు సమయంలో ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆయన ప్రసంగాలు, చర్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు మీడియా ఛానళ్లతో కలిసి రాష్ట్రంలో సామాజిక, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రఘురామకృష్ణరాజు కుట్ర చేశారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐడీ పేర్కొంది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తన అభిప్రాయాలు చెబితే కుట్ర కేసులు పెట్టారని రఘురామ హైకోర్టుకు వెళ్లారు.
ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు అసలు రాజద్రోహం కేసులను విచారించవద్దని తీర్పు ఇచ్చింది. ఇతర సెక్షన్ల కింద విచారణకు అనుమతి రావడంతో సీఐడీ ఎప్పుడైనా ఇక రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.