AP High Court : సర్కారు వారి ఆటకే ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్, మల్టీప్లెక్స్ లకు తప్పదు వెయిటింగ్!
AP High Court On Cinema Tickets : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమా టికెట్ల ప్లాట్ ఫామ్ లోనే ప్రస్తుతానికి టికెట్లు అమ్మకోవాలని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
AP High Court On Cinema Tickets : ప్రభుత్వ పోర్టల్ సినిమా టికెట్ల అమ్మకానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు తమ సొంత పోర్టల్స్ లో సినిమా టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతివ్వలేమని హైరోక్టు తెలిపింది. ఏపీ స్టేట్, ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ఎలా సాగుతుందో కొంతకాలం వేచిచూడాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ ద్వారా టికెట్లను విక్రయించుకోవచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తెలిపింది.
జులై 12కి తదుపరి విచారణ వాయిదా
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌ల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని, విచారణను జులై 12కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్ 17న జారీ చేసిన జీవో 142ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో సవాల్ చేసింది. ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్ సవరణ చట్టం ద్వారా టికెట్ల విక్రయ వేదికను ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీకి అప్పగిస్తూ గత డిసెంబర్ 17న జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో 142పై హైకోర్టులో వ్యాజ్యం
జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ తరఫున మంజీత్ సింగ్, మరోకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు గురువారం విచారించింది. మల్టీప్లెక్స్ యాజమాన్యాల తరఫున న్యాయవాది సుమిత్ నీమా, ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ ద్వారా టికెట్లు విక్రయించేందుకు బుక్ మై షో, పేటీఎం, ఇతర సంస్థలు ముందుకొచ్చినప్పుడు అభ్యంతరం ఏమిటని మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ప్రశ్నించింది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆన్‌లైన్ లో సినిమా టికెట్లు విక్రయించవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : CM Jagan Review : రైతులకు శుభవార్త, మే 16న రైతు భరోసా నిధులు విడుదల
Also Read : రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలతో ఏపీలో దుమారం! తక్షణం మంత్రి క్షమాపణకు టీడీపీ డిమాండ్