AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీపై కూటమి సర్కార్ వేటు, వందల కోట్ల మళ్లింపు ఆరోపణలు!
AP News: ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ కేంద్ర సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఏపీ సర్కారు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది.
Madhusudhan Reddy Fibernet: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాయాంలో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థకు ఎండీగా పని చేసిన మధుసూదన్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పట్లో ఫైబర్ నెట్ సంస్థకు ఎండీగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఎండీ హోదాలో ఈయన కేంద్ర సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా మధుసూధన్ రెడ్డి అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆయన ఎల్లప్పుడూ విచారణకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది.
అంతకుముందు రైల్వే అకౌంట్స్ సర్వీసు (IRAS) అధికారి అయిన మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్ కు చెందిన వారు. 2019లో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చారు. అలా ఫైబర్ నెట్ ఎండీగా జగన్ సర్కారు నియమించగా.. ఆయన నిబంధనలకు విరుద్ధంగా సంస్థలో ఉద్యోగ నియామకాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, నిధుల విషయంలోనూ అవకతవకలకు పాల్పడ్డట్లుగా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జగన్ ప్రభుత్వ హాయాంలో ఫైబర్ నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య బాగా తగ్గినట్లుగా లెక్కలు చూపారని.. కానీ, అసలు వసూలైన బిల్లుల మొత్తాన్ని ముంబయిలోని బినామీ ఖాతాలకు మళ్లించినట్లుగా మధుసూధన్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా ఎండీ హోదాలో ఉన్న మధుసూధన్ ఏకంగా ప్రతి నెలా రూ.14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ.238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు మధుసూదన్ రెడ్డి రికార్డులను కూడా ట్యాంపర్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఫైబర్ నెట్ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మెటీరియల్ కొనుగోలులో కూడా గోల్‌మాల్ చేశారని అంటున్నారు.
మధుసూధన్ 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీస్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చారు. ఆ డిప్యుటేషన్ గడువు ఆగస్టు 22తో ముగియాల్సి ఉంది. అయితే, తాము అవకతవకల్లో విచారణ చేపట్టబోతున్నందున రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. డిప్యుటేషన్ గడువు పొడిగించాలని కోరింది. మరో ఆరు నెలలు ఆయన్ను డిప్యుటేషన్‌లోనే ఉంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది.