AP Movie Tickets: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత....
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ సర్కార్ జీవో 142 తీసుకొచ్చింది. దీంతో ఆన్ లైన్ మూవీ టికెట్ల విక్రయం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూడనుంది.
ఏపీలో సినిమా టికెట్ల తంతు ఇప్పటిలో తేలెట్లు లేదు. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు ప్రభుత్వం జీవోలపై జీవోలు విడుదల చేస్తోంది. తాజాగా ఏపీ సర్కార్ ఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం జీవో 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల విక్రయాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఇకపై ఏ సినిమా టికెట్లు అయినా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మకాలు జరిపాలని ఈ జీవో ఉద్దేశం. రైల్వే రిజర్వేషన్ల ఐఆర్సీటీసీ విధానంలో ఆన్‌లైన్ మూవీ టికెట్ల బాధ్యతను APFDC(AP Film Development Corporation)కి అప్పగించింది. త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపింది.
Also Read: టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?
హైకోర్టుకు చేరిన వివాదం
సినిమా టికెట్ల రేట్లను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35ను జారీ చేసింది. ప్రాంతాల వారీగా టికెట్ల రేట్లు ఎంత ఉండాలనేది ఈ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవోని సవాల్ చేస్తూ కొన్ని థియేటర్ల యజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జీవో 35ను రద్దు చేసింది. పాత పద్దతిలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం సింగిల్ జడ్జి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు ఇచ్చింది. సినిమా టికెట్లపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. థియేటర్ యాజమాన్యాలు ధరల పెంపు ప్రతిపాదనల్ని జేసీ ముందు ఉంచాలని తెలిపింది. టికెట్ ధరలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Also Read: పవన్ వాఖ్యలతో టాలీవుడ్ పరేషాన్.. బడా, చోటా నిర్మాతలు తలోదారి.. సినీ పెద్దలు సేఫ్ గేమ్!
థియేటర్ల యాజమాన్యాల వాదన ఇలా
అయితే థియేటర్ల యాజమాన్యాలు అన్ని థియేటర్ల మెయింటెనెన్స్ ఒకేలా ఉండదని, చిన్న సినిమా, పెద్ద సినిమాను ఒకే విధంగా చూడవద్దని వాదిస్తున్నాయి. అలాగే అదనపు షోలు వేసుకునే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. సినిమా బడ్జెట్ బట్టి టికెట్ల రేట్లు పెంచుతామనడం సరికాదని ప్రభుత్వం అంటోంది. ఆన్‌లైన్ విధానంతో బ్లాక్ టికెట్ల సమస్యను పరిష్కరిస్తామని, పన్ను ఎగవేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని చెబుతోంది. దీనిపై తాజాగా జీవో 142 తీసుకొచ్చింది. దీనిపై థియేటర్ల యాజమాన్యాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి.
Also Read: ఏపీలో ఇక ఓన్లీ ఆన్ లైన్ మూవీ టిక్కెట్స్.. చట్టం ఆమోదం !