(Source: Poll of Polls)
YS Jagan: పీఎంను మించిన వైఎస్ జగన్ సెక్యూరిటీ! ఏపీ ప్రభుత్వం ఎంక్వైరీ?
YS Jagan Security: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా లేని విధంగా మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ టీడీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Allegations On YS Jagan Security: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై దృష్టి సారించింది. వైసీపీకి కొమ్ము కాసిన అధికారులను ఇప్పటికే దూరం పెట్టింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై వచ్చిన ఆరోపణపై దృష్టిసారించింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడా లేని విధంగా మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ టీడీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ప్రధానికి కూడా అంత భద్రత లేదట!
మాజీ సీఎం జగన్ భద్రతా మాన్యువల్ ఉల్లంఘించారని, సెక్యూరిటీ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని టీడీపీ నేతల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా లేనంతగా భద్రతను జగన్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్యాలెస్‌ల వద్ద ఏకంగా 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి. తాడేపల్లి, హైదరాబాద్, పులివెందులలోని నివాసాల వద్ద ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. అంతే కాదు.. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని, భద్రతా నియమాలను ఉల్లంఘించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. దీంతో కొత్తగా వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జగన్ భద్రత అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
జగన్ ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్
జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన క్యాంపు కార్యాలయం చుట్టూ 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. బస్సు యాత్రలో దాడి జరిగిన తరువాత ఆయన భద్రత దృష్ట్యా రూ.1.13 కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ సొమ్మును జగన్ సొంత సొమ్ములా ఖర్చు పెట్టారని విమర్శలు చేశారు.
అయితే దీనిపై వైసీపీ నేతలు సైతం ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఏపీ ఎన్నికల సమయంలో జగన్‌పై హత్యాయత్నం జరగడంతో సెక్యూరిటీ అధికారులు కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. చుట్టూ ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే బకింగ్‌హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించి స్నైపర్ షాట్స్‌ను నిలువరించే విధంగా ఇంటి చుట్టూ ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీనిపై సైతం అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశముంది.