సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్టు 15న ప్రారంభించకపోవడంతో విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
Family Doctor : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు చెప్పారు. గ్రామీణ పేదలకు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థ అందుబాటులో వుండాలన్న వుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అనుగుణంగానే ఇటీవల రాష్ట్రంలో పెద్దయెత్తున సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.
వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణం
రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా మొత్తం 1,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లనిక్ లోనూ సుశిక్షితులైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంహెచ్ఎల్ పి), ఒక ఎఎన్ఎం, ముగ్గురు నుండి నలుగురు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలకు సేవలందిస్తారని వివరించారు. ఎంఎల్ హెచ్ పిలుగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ లను నియమిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 8,500 మంది ఎంఎల్ హెచ్ పిలను నియమించామని, మరో 1,500 మంది ఎంఎల్ హెచ్ పిల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని క్రిష్ణబాబు చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో 1,500 క్లినిక్ లకు సొంత భవనాలున్నాయని, మరో 8,500 భవనాలు నిర్మాణదశలో వున్నాయని చెప్పారు. ఇందులో 2,000 భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, మరో 3,000 భవనాలు తుది మెరుగులు దిద్దుకునే దశలో వున్నాయని వివరించారు. మిగిలిన 3 వేల భవనాల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేసి ఈ వ్యవస్థను సుస్థిరం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు.
హెల్త్ క్లీనిక్‌లో 67 రకాల మందులు , 14 రకాల వైద్య పరీక్షలు
ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో 67 రకాల మందులను, 14 రకాల వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలను అందుబాటులో వుంచుతున్నామన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నాటికి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్ సిలు) ఉన్నాయన్నారు. ప్రతి మండలంలోనూ రెండు పిహెచ్ సిలు లేదా ఒక పిహెచ్ సి, ఒక సిహెచ్ సి (సామాజిక ఆరోగ్య కేంద్రం)వుండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని వివరించారు. వీటికి అదనంగా ప్రభుత్వం మరో 176 పిహెచ్ సిలను మంజూరు చేసిందని, త్వరలోనే వాటి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి పిహెచ్ సిలో కూడా ఇద్దరు వైద్యులు అందుబాటులో వుంటారని, ప్రస్తుతం 176 మంది వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా వున్నాయని, వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, దీనికి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ నెల 24న వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి 31వ తేదీ లోగా కేటాయించిన కేంద్రాలలో బాధ్యతలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సంక్రాంతి నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్
ప్రస్తుతం 60 శాతం గ్రామ సచివాలయాల్లో నెలకు రెండుసార్లు ఎంఎంయు వైద్య సేవలందుతున్నాయని, మిగిలిన 40 శాతం గ్రామ సచివాలయాల పరిధిలో నెలకు ఒకసారి ఈ సేవలందుతున్నాయని చెప్పారు. డిసెంబర్ నుండి ప్రతి గ్రామ సచివాలయానికీ నెలకు రెండుసార్లు వంతున ఎంఎంయు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో పిహెచ్ సిలోని ఒక వైద్యాధికారి గ్రామ స్థాయిలో ఒపి విధులు నిర్వహిస్తారని, మరొకరు పిహెచ్ సిలో ఒపి విధులు నిర్వహిస్తారని వివరించారు. ఎంఎంయు లో వచ్చిన వైద్యాధికారి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో వుంటారని చెప్పారు. హెల్త్ క్లనిక్ లోని ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామంలోని గర్భస్థ మహిళలు, బాలింతలు, పాలిచ్చే తల్లుల వంటి వారితో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారి జాబితా ను వైద్యాధికారి పర్యటనకు ముందు రోజే సిద్ధం చేస్తారన్నారు. ఆగస్టు పదిహేను నుంచే ప్రారంభిస్తామని గతంలో ప్రకటించారు కానీ అమలు చేయకపోవడంతో విపక్షాలు విమర్శలు చేశాయి. అందుకే ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.