Sajjala Ramakrishna Reddy: 'చంద్రబాబు స్క్రిప్ట్ లో ఏం ఉందో చూడకుండా బట్టీ పట్టారు' - షర్మిల వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్
Andhra Politics: సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ఖండించారు. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని నిలదీశారు. ఏపీ రాజకీయాలపై ఆమెకు అవగాహన లేదన్నారు.
Sajjala Counter to Ys Sharmila: సీఎం జగన్ (CM Jagan) పై ఏపీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala) కౌంటర్ ఇచ్చారు. 'ఆమెకు పదవులు ఇవ్వకపోవడమే చేసిన అన్యాయమా.?' అంటూ ప్రశ్నించారు. షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఆమె పొంతన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.?. ఏపీ రాజకీయాలపై ఆమెకు అవగాహన లేదు. వైఎస్ఆర్టీపీలో షర్మిలతో పాటు చాలా మంది తిరిగారు. షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ రాయించారేమో.? అందులో ఏముందో చూడకుండా ఆమె బట్టీ పట్టారు. జగన్ ఓదార్పు యాత్ర చేపడితే కాంగ్రెస్ ఎంత వేధించిందో అందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో షర్మిల కలవడం విచిత్రంగా ఉంది.' అంటూ ధ్వజమెత్తారు.
షర్మిల గారు మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు.
— YSR Congress Party (@YSRCParty) January 25, 2024
సీఎం @ysjagan గారు షర్మిల గారికి ఏమి అన్యాయం చేశారో ఆమెనే చెప్పాలి.
తెలంగాణలో పార్టీ కోసం పనిచేసిన వారికి షర్మిల గారు ఏమి న్యాయం చేశారు ?
- వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి pic.twitter.com/Yn9M18kIsn
'షర్మిల సమాధానం చెప్పాలి'
'షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారు. రావడమే వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆమెకు ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదు. వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే. వైఎస్సార్ కూతురిగా, జగన్ చెల్లెలుగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫ్యామిలీని ఎంత వేధించిందో షర్మిలకు తెలుసు. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికి ఇస్తారా.?. తనకు జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ కోసం పని చేసిన వారికి ఆమె ఏం చేశారు?' అని సజ్జల నిలదీశారు.
'పథకాలు బీజేపీవా.?'
'రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీవా.?' మరెందుకు తాము బీజేపీతో కలిశామని షర్మిల ఆరోపణలు చేస్తారని సజ్జల మండిపడ్డారు. 'ఏం ఆశించి అన్న కోసం తిరిగారో షర్మిల చెప్పాలి' అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ గురించి తాము చేయాల్సిన ప్రయత్నాలు చేశాం కాబట్టే అది ఆగిందని గుర్తు చేశారు. పోర్టుల గురించి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. మణిపూర్ విషయంలో షర్మిల తెలంగాణలో ఎందుకు మాట్లాడలేదని.. ఏపీకి వచ్చాకే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారమే చంద్రబాబు షర్మిలను తెచ్చారని.. ఆయనకు ఏది అవసరమో అదే షర్మిల మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, షర్మిల మధ్య ఏ ఒప్పందం జరిగిందో బయటపెట్టాలని ధ్వజమెత్తారు. ప్రజలకు అవసరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. చంద్రబాబులా అనవసర గోబెల్స్ ప్రచారం కోసం తాము ఖర్చు చేయడం లేదని అన్నారు.
Also Read: Sharmila Vs Jagan: జగన్ ఓ నియంత- సీఎం అయ్యాక మారిపోయిన మీరు వైఎస్ వారసులెలా అవుతారు?