AP Employees VS Governament : వైఎస్ఆర్‌సీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్! ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు ఫలిస్తాయా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం కనిపించే అవకాశం ఉండటంతో ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
AP Employees VS Governament : ఉద్యమ కార్యాచరణలోకి దిగిన ఉద్యోగ సంఘాలను కూల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వారితో చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే ఒకసారి మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. వారి సమస్యలపట్ల సానుకూలంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించ బోతోం దన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఉద్యోగులు, పట్టభద్రుల మద్దతు లభించదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కూల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఇబ్బంది !
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని గెలిచితీరాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు దిగడం పట్ల ప్రభుత్వ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఉద్యోగ సంఘాలు గతంలో ఏవైతే డిమాండ్లతో ఉద్యమానికి దిగుతామని ప్రభు త్వానికి చెప్పాయో ఇప్పుడు కూడా అవే డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి ఆర్ధిక పరమైన అంశాలైనందున వెంటనే కార్యాచరణ సాధ్యం కాదని ప్రభుత్వ వాదన కనిపిస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం గతంలోలా మాటలకుపడిపోయే పరిస్థితి లేదని. .. పూర్తి స్థాయిలో డిమాండ్లు నెరవేర్చాలని అంటున్నారు.
ప్రభుత్వ చర్చలు ఫలిస్తాయా ?
ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన పదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల రెగ్యులర్ అంశం, 13 వేల మందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ, పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్‌పై ప్రభుత్వ నిర్ణయం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తదితర అంశాలున్నాయి. ఇవికాకుండా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల అంశానికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిశాక ఒక డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసులను కూడా మాఫీ చేయడం వంటి డిమాండ్లు ఇంకా పరిష్కారంకాలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.కానీ అమలు చేయలేదు.
9 నుండి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
తమ సమస్యలను పరిష్క రించాలని, సీపీఎస్‌ను అమలు చేయాలంటూ ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు- ఏపీజేఏసీ అమ రావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంక టేశ్వర్లు ప్రకటించారు. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళ నలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈనెల 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. అప్పటికీ స్పందిం చకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని .. తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్‌ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. ఉద్యోగుల అసంతృప్తిని డిమాండ్లను పరిష్కరించకపోతే.. వైఎస్ఆర్‌సీపీకి చిక్కులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.