AP Govt Vs Highcourt : హైకోర్టు ఆగ్రహిస్తున్నా ఉపాధి బిల్లులు ఏపీ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు ? అసలు వివాదం ఏమిటి..?
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఆపడం ఏపీలో వివాదాస్పదం అవుతోంది. తాము నిధులు ఇచ్చేశామని కేంద్రం చెబుతోంది. చెల్లించాలని హైకోర్టు ఆదేశిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం రకరకాల కారణాలతో చెల్లింపులు చేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసుల్లో ముఖ్యమైనది ఉపాధి హామీ నిధులు చెల్లించకుండా పెండింగ్ పెట్టడం. ఈ విషయంలో ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులకు కూడా ఆదేశించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మొత్తంగా హైకోర్టులో తమకు ఉపాధి బిల్లులు ఇవ్వలేదని 450కుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాము రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఉపాధి హమీ నిధులన్నింటినీ ఇచ్చేశామని.. ఇంకా చెప్పాలంటే తమ నిధులే ఏపీ ప్రభుత్వం వద్ద రూ. 1991 కోట్లు ఉన్నాయని అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు ఉపాధి హామీ బిల్లులు ఏపీ ప్రభుత్వం చెల్లించడం లేదా..? ఎందుకు ఇంత తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి..? కోర్టు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసినా ఎందుకు మళ్లీ మళ్లీ చెల్లింపుల వివాదం వస్తోంది..?
2018-19 నాటి ఉపాధి బిల్లులను మాత్రమే చెల్లించని ఏపీ ప్రభుత్వం..!
కరువు ప్రాంతాల్లో ప్రజల ఉపాధి హామీ కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఇందులో కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా కొంత వాటా భరించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుకు స్పష్టమైన నిబంధనలను కేంద్రం పెట్టింది. కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రానికి ఉపాధి మెటీరియల్ నిధులు విడుదల చేసే ప్రతి సందర్భంలోనూ మూడు రోజుల్లోపు చెల్లింపులు చేపట్టాలి. ఆలస్యమైతే వడ్డీతో పాటు చెల్లించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే నిధులు విడుదల చేయబోమని కేంద్రం హెచ్చరిస్తూ ఉంటుంది. ముందు చేసిన పనులకు ముందుగా చెల్లింపులు చేయాలనేది కేంద్రం నిబంధన. తమ రాష్ట్రంలోని పేదలకు ఉపాధి కల్పించడానికి ఈ పథకం అమలును చాలా ప్రతిష్టత్మకంగా తీసుకుంటాయి అన్ని రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే తీసుకుంది. ఆ పథకం కింద వచ్చే నిధులతో ఉపాధి కల్పించడమే కాదు రాష్ట్రంలో అభివృద్ధి పనులు కూడా చేయవచ్చు. అందుకే ఏపీ ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటిని ఉపాధి హామీ నిధులతోనే నిర్మిస్తున్నారు. చెల్లింపులు కూడా చేస్తున్నారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లింపులపై ఏపీ ప్రభుత్వానికి వివాదాల్లేవు. ఈ కాలంలో ఉపాధి పనులు చెల్లించడం లేదని ఎవరూ హైకోర్టులో పిటిషన్లు వేయలేదు.
ఆ పనులన్నీ టీడీపీ ద్వితీయ శ్రేణీ నేతలు చేశారన్న కారణంగానే నిలిపివేత..?
ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించలేదనే ఆ పనులు చేసిన పలువురు కాంట్రాక్టర్లు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు మాత్రమే పనులు చేశారన్న కారణంగా ప్రభుత్వం అప్పట్నుంచి చెల్లింపులు నిలిపివేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2018-19 సంవత్సరానికి గాను అధికారిక లెక్కల ప్రకారం 7 లక్షల పైచిలుకు పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించలేదు. నిబంధనల ప్రకారం 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 7.94 లక్షల పనులు జరుగగా.. వాటి లో 11 వేల పనులను నమూనాగా తీసుకుని విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. రూ.5 లక్షల లోపు విలువచేసే 7.27 లక్షల పనులకు 20 శాతం సొమ్ము మినహాయించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ అమలు చేయలేదు. చేసిన పనులకు నిధులు విడుదల కాక పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
చెల్లించాలని ఏడాదిన్నర కిందటే హైకోర్టు ఆదేశాలు..!
హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారణలో పలుమార్లు ఉపాధి హామీ పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. మొత్తం సొమ్ము చెల్లించాలని 2020 జనవరిలోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్నుంచి ఇప్పటికీ చెల్లించలేదు. ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతూ వస్తోంది. ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బకాయిలు ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు గతంలోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రానికి కేంద్రం ఏయే తేదీల్లో నిధులు విడుదల చేశారో వివరాలివ్వాలని, వాటిని నిబంధనల ప్రకారం విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కానీ వివిధ కారణాలు చెబుతూ. ఏడాది నుంచి వాయిదాలు వేస్తూనే వస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు..!
కేంద్ర ప్రభుత్వానికి సైతం ఈ అంశంపై ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్రం కూడా రాష్ట్రాన్ని వివరణ కోరింది. అప్పట్లో ఉపాధి హామీ చెల్లింపులు విధానాన్ని్ మారుస్తున్నామని సీఎప్‌ఎంస్ అమల్లోకి తీసుకొస్తున్నందున నిధులు విడుదల చేయడం ఆలస్యమైందని కేంద్రానికి లేఖ రాసింది. త్వరలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పింది. మరోసారి ఈ పనుల్లో అవకతవకలు జరిగాయని, విచారణ అనంతరం చెల్లిస్తామని చెబుతూ కేంద్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు రూ.5లక్షల లోపు ఉన్న పనులకు సంబంధించిన బిల్లులను 20శాతం తగ్గించి చెల్లిస్తామని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ చెల్లించలేదు. ఈ ఏడాది మార్చి 30న హైకోర్టు మరోసారి ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించడంతో రూ.5లక్షల లోపు అంచనా విలువ కలిగిన పనులకు సంబంధించి సుమారు రూ.400కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. కోర్టుల్లో పిటిషన్లు వేసిన వారికి మాత్రం 20 శాతం తగ్గించి చెల్లింపులు చేస్తున్నారు. మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని కోర్టు ధిక్కరణ చర్యలకు హైకోర్టు ఆదేశాలు..!
తాజా విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాలేదని... వస్తే చెల్లిస్తామంటున్నారు. అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాత్రం రాష్ట్రానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన నిధులన్నీ చెల్లించామని, బకాయిలు లేవని తేల్చేశారు. పార్లమెంట్‌లో అదే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ అదే చెప్పారు. కేంద్రం మొత్తం నిధులు ఇచ్చినా చెల్లింపులు చేయలేదంటే ఇతర పథకాలకు మళ్లించారా అని ప్రశ్నించింది. ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ విమర్శలు ఉన్నాయి. ఉపాధి నిధులు మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హైకోర్టులో విచారణ ఆసక్తి రేపుతోంది. అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నా చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్న అభిప్రాయం తాజా పరిణామాలతో వినిపిస్తోంది.
ఎవరేమన్నా బిల్లుల చెల్లింపుల్లో మారని ప్రభుత్వ వైఖరి..!
ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఉపాధి హామీ పనుల కాంట్రాక్టులు ఆయా పార్టీల సానుభూతి పరులకే వస్తాయి. తమ పార్టీ కోసం కష్టపడిన వారికి ఆర్థికంగా లబ్ది చేకూర్చడానికి గ్రామ స్థాయి నేతలకు ఈ పనులను ప్రభుత్వాలు ఇస్తాయి. ఈ కారణంగా టీడీపీ నేతలు అప్పట్లో పనులు పొందారు. వారే పనులు చేశారు . అయితే బిల్లులు మంజూరయ్యే సమయానికి ఎన్నికలు రావడంతో వారందరికీ బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చినప్పటికీ.. అక్రమాల పేరుతో చెల్లించడానికి రాష్ట్రం ఇష్టపడలేదు. ఆ నిధులను వేరే పథకాలకు వాడుకున్నారా లేదా అన్నది హైకోర్టు విచారణలో తేలుతుంది. అయితే కేంద్రం మాత్రం నిధులు ఇచ్చింది. ప్రభుత్వం మాత్రం ఆపిందన్నది నిజం. ఆ విషయం హైకోర్టులోనే కేంద్రం అఫిడవిట్ ద్వారా తెలిపింది. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న వారంతా తమ పార్టీ సానుభూతి పరులేనని టీడీపీ పెద్దలకూ తెలుసు. అందుకే ఆ పార్టీ బిల్లుల కోసం రాజకీయంగా ఆందోళనలు చేస్తోంది. అదే సమయంలో హైకోర్టులో న్యాయపోరాటం చేసే వారికి తమ పార్టీ న్యాయవిభాగం తరపున లాయర్లను కూడా సమకూరుస్తున్నారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో.. మూడేళ్ల కిందట పనులు చేసిన వారికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.