(Source: ECI/ABP News/ABP Majha)
AP News: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ఆకర్షణీయంగా యూనిఫామ్, ఒక్కొక్కరికి మూడు జతలు!
AP News: ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం ఈసారి మూడు జతల యూనిఫామ్ లను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అలాగే ఆకర్షణీయమైన రంగుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
AP News: రాష్ట్రంలోని సర్కారు బడి పిల్లలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. బడికి వెళ్లే పిల్లలకు నాణ్యమైన స్కూలు బ్యాగు, సాక్సులు, బూట్లు, బెల్టుతో పాటు ఆకట్టుకునే యూనిఫామ్ ను కూడా అందిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యా సంవత్సరానికి మరింత మెరుగైన, ఆకర్ణణీయమైన రంగుల్లో యూనిఫామ్ ఇవ్వనుంది. ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున 39 లక్షల 95 వేల 992 మంది విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ ను జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఇచ్చిన క్లాత్ సరిపోలేదని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈసారి యూనిఫామ్ కొలతలను పెంచారు. బాలికలకు ముదురు లావెండర్ రంగులో గౌన్, లావెండర్ రంగులో చెక్స్ తో టాప్, బాలురకు ముదురు నీలంపై నల్ల రంగు చొక్కా, డార్క్ మిడ్ నైట్ బ్లూ రంగులో ప్యాంటు, నిక్కర్ ఉండనున్నాయి. అలాగే చొక్కా నిక్కర్, గౌను, ప్యాంటు, చుడీదార్ వంటి బాలురు, బాలికలకు రెండు రంగుల్లో యూనిఫాం ఇస్తున్నప్పటికీ.. తరగతులను బట్టి డిజైన్ ను ఎంపిక చేశారు.
తరగతుల వారీగా యూనిఫాం..
ఒకటి నుంచి 7వ తరగతి వరకు బాలురకు హాఫ్ చేతుల చొక్కా, నిక్కర్, అలాగే 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాఫ్ చేతుల చొక్కా ఫుల్ ప్యాంటు అందించబోతున్నారు. ఒకటి, రెండు తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, గౌను.. 3, 4, 5 తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, స్కర్టు, ఆరు నుండి పదో తరగతి బాలికలు చున్నీతో చుడీదార్ యూనిఫాంగా నిర్ణయించారు. ఆయా తరగతులను అనుసరించి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 1.25 మీటర్ల నుంచి 3.30 మీటర్ల ప్యాంట్ క్లాత్, 1.80 మీటర్ల నుంచి 3.30 మీటర్ల చొక్కా క్లాత్ అందిస్తున్నారు. గౌను లేదా చుడీదార్ బాటమ్ కోసం బాలికలకు 3.60 మీటర్ల నుంచి 3.80 మీటర్లు, చొక్కా లేదా చుడీదార్ టాప్ క్లాత్ కోసం 2.10 మీటర్ల నుంచి 4.20 మీటర్ల క్లాత్ ఇస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ సరిపోలేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాత్ ను 23 నుంచి 60 శాతం అదనంగా అందిస్తున్నారు.
వేర్వేరు కొలతల్లో క్లాత్
ఒకటో తరగతి నుంచి పదో తరగతి బాల బాలికలకు వేర్వేరు కొలతల్లో క్లాత్ ఇస్తున్నారు. ఇచ్చిన క్లాత్ లో మూడు జతలు వస్తాయా, రావా అని ఒకటికి రెండు సార్లు అధికారులు పరిశీలించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు బాల బాలికలను ఎంపిక చేసి, వారి కొలతలను తీసుకున్నారు. వాటితోనే తరగతుల వారీగా మూడు జతలు కుట్టించారు. అవా బాగా రావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే యూనిఫాంల కొరకు అందిస్తున్న క్లాత్ ను విద్యా దీవెన కానుక కిట్ లో పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇవి మాత్రమే కాకుండా విద్యా దీవెన కానుక ద్వారా పిల్లలకు పుస్తకాలతో పాటు పోషకాహారాన్ని అందిస్తోంది జగన్ సర్కారు.