AP Floods: ఏపీలో వరద నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం - శాఖల వారీగా నష్టం వివరాలివే!
Andhra News: ఏపీలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రకృతి విపత్తుతో మొత్తం రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నివేదికను ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది.
AP Government Estimates Flood Damage: ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. విపత్తు కారణంగా మొత్తం రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. శాఖల వారీగా నష్టం అంచనాలను అధికారులు వెల్లడించారు. ఆర్అండ్‌బీకి రూ.2164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ సరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.39.9 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాాగా, ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా కేంద్ర బృందం పర్యటించింది. అటు, తెలుగు రాష్ట్రాల్లో వరదలకు తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు విడుదల చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, అది నిజం కాదని.. ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదని సీఎం చంద్రబాబు శుక్రవారం స్పష్టం చేశారు.
తేరుకుంటోన్న నగరం
మరోవైపు, గత వారం రోజులుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద పూర్తిగా తగ్గలేదు. శనివారం మరోసారి వర్షం కురవగా కొంత ఆందోళన నెలకొంది. ఎడతెరిపి లేని వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అటు, జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జల దిగ్బంధలోనే ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సృజన.. అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని.. భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉందని అన్నారు. పల్లపు ప్రాంతాల్లోని వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఇంకా కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు సాగుతుండగా బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని సూచించారు.
అటు, వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాల కిట్ అందిస్తోంది. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని.. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం మధ్యాహ్నానికి బుడమేరు గండ్లు కూడా పూడ్చడంతో నగరంలోకి వరద ప్రవాహం తగ్గింది. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్లు పూడ్చివేత ప్రక్రియను గత 6 రోజులుగా దగ్గరుండీ మరీ పర్యవేక్షించారు.