CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Vijayawada news: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు. ముందుగా ప్రకటించిన విధంగానే సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కును విరాళంగా అందించారు.
Pawan Kalyan Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ కలెక్టరేట్‌లో కలిశారు. ముందుగా ప్రకటించిన విధంగా పవన్.. సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. కాగా, ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం పవన్ కల్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.కోటి చొప్పున ఇస్తానని వెల్లడించారు. వరదలతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులు ఇస్తానని విరాళంగా ఇస్తానని చెప్పారు. పవన్ భారీ సాయంపై సీఎం అభినందించారు.
వరద బాధితుల సహాయార్ధం ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల విరాళం చెక్కును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును కలిసి అందచేశారు. ఈ సందర్భంగా @PawanKalyan ను సీఎం అభినందించారు.#VijayawadaFloods #AndhraPradesh pic.twitter.com/LBgKkrSFay
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2024
సీఎం టెలీ కాన్ఫరెన్స్
మరోవైపు, విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని.. ఆయా చోట్ల పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. మళ్లీ వర్షం ప్రారంభమైన క్రమంలో సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని సీఎం ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి పూర్తిగా వరద తగ్గిపోతుందని అధికారులు చెప్పారు. అటు, తెలంగాణలో వర్షాలకు ఏపీకి వరద వచ్చే ఛాన్స్ ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు.
బుడమేరు గండ్లు పూడ్చివేత
అటు, విజయవాడలో తీవ్ర వరదలకు కారణమైన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయి విజయవాడకు (Vijayawada) ముప్పు తప్పినట్లయింది. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా.. తాజాగా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద తాజాగా మూడో గండిని పూడ్చేశారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పనులను పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగిన క్రమంలో రాష్ట్ర అధికారులు, సైన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.
జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత 6 రోజులుగా బుడమేరు గట్టుపైనే ఉంటూ పనులను పర్యవేక్షించారు. రెండో దశలో వరద పెరిగినా తట్టుకునేలా మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు గట్లు ఎత్తు పెంచే పనులు చేపట్టామని చెప్పారు. వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గట్లను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గండ్లు పూర్తిగా పూడ్చడంతో వరద పూర్తిగా తగ్గిందని.. ఇప్పుడిప్పుడే పొలాలు బయటపడుతున్నాయని అన్నారు. అటు, జక్కంపూడి, సింగ్ నగర్, నిడమానూరు వరకూ నిలిచిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Also Read: Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు