AP helicopter issue: ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
AP government : ఏపీ ప్రభుత్వం అద్దెకు తీసుకున్న హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించారు. ఉద్దేశపూర్వకంగా ఫేక్ చేస్తున్నవారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP government helicopter Issue: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు. తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో గతంలో వినియోగించిన చాపర్ స్థానంలో మరో హెలీకాప్టర్ అద్దెకు తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన హెలీకాప్టర్‌ను సీఎం సహా వీవీఐపీల కోసం అద్దె ప్రాతిపదికన ఇన్నాళ్లూ ప్రభుత్వం వినియోగించింది. ఇటీవల కాలంలో ఈ ఛాపర్‌కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓ సారి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో మరోసారి హెలికాప్టరులో సాంకేతిక సమస్యలు వచ్చాయి.
తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు పీయూష్ గోయల్ ఆ హెలీకాప్టరులో వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆనాడు ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇది జరిగి చాలా రోజులు అవుతోంది. అప్పట్లోనే ఈ హెలికాప్టర్ స్థానంలో వేరే హెలికాప్టర్ వినియోగించాలనే.. లేకుంటే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయనే చర్చ జరిగింది. అయితే ఇటీవల కాలంలో మరికొన్ని సందర్భాల్లో ఇదే తరహా సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు, టేకాఫ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వంటి ఇబ్బందులు బెల్ కంపెనీ హెలికాప్టరులో వచ్చాయి. దీంతో సీఎం సహా.. వివిధ వీవీఐపీల పర్యటనకు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ను కొనసాగించ వచ్చా..? లేదా..? అనే అంశంపై సీఎం భద్రతా పరంగా పరిశీలించారు. బెల్ కంపెనీ హెలీకాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వేరే హెలికాప్టరును వినియోగించాలని భద్రతా వర్గాలు సూచించాయి. ఈ మేరకు ఇప్పటి వరకు వినియోగిస్తున్న హెలీకాప్టర్ స్థానంలో మరో హెలికాప్టరును ప్రభుత్వం అద్దెకు తీసుకున్నారు. బయట తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా ఎక్కడా కొత్త చాపర్ కొనుగోలు చేయలేదు. అద్దెకు తీసుకునే హెలికాఫ్టర్ మార్చారు.
ఇప్పటి వరకు హెలికాప్టర్ వినియోగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో.. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన వేరే చాపర్‌కు కూడా దాదాపుగా అంతే ఖర్చు కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అద్దెకు తీసుకుని వినియోగిస్తున్న చాపర్ గతంలో వాడిన దానికంటే కొంచెం అధునాతనమైనది. దీనిలో నేరుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ప్రయాణం చేయవచ్చు... భద్రత పరంగా కూడా గత హెలికాఫ్టర్ కంటే కొంచెం మెరుగైనది. గతంలో విజయవాడ నుంచి సుదూర ప్రాంతాలకు, చిట్టచివరి జిల్లాలకు వెళ్లాలంటే...కొంత దూరం విమానం, తరువాత హెలికాఫ్టర్ వాడే వాళ్లు. దీని వల్ల అదనంగా ఖర్చు అవ్వడంతో పాటు ఎక్కువ సమయం పట్టేది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ముందుగా విశాఖ లేదా తిరుపతి లేదా కడప, కర్నూలు వెళ్లడం...అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో జిల్లాలకు, నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చేది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనల నిమిత్తం ప్రభుత్వం అధునాతన హెలికాప్టర్ కొన్నది అంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. విషయం ఏమిటంటే, సీఎం పర్యటనల నిమిత్తం అద్దెకు తీసుకునే పాత హెలికాప్టర్ స్థానంలో వేరే అధునాతన మోడల్ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవడం జరుగుతుంది. ఈ… pic.twitter.com/zrTzNkodMi
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 5, 2025
ఇప్పుడు వాడే హెలికాఫ్టర్ ద్వారా అమరావతి నుంచి నేరుగా అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు వరకు ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల ప్రభుత్వ కాన్వాయ్ లు, ఫ్లైట్ ఖర్చులు తగ్గుతాయి. ఓవరాల్ టూర్ ఖర్చులో 70 శాతం మేర ఆదా అయ్యే అవకాశం ఉంది. నేరుగా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికే సిఎం అమరావతి నుంచి వెళ్లే అవకాశం ఉండడం వల్ల సమయం కూడా కలిసి వస్తుంది. భద్రత కలిగి ఉండటం, ఖర్చు తగ్గడంతో పాటు ఇతర అన్ని అంశాలను పరిశీలించి ఈ హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు వినియోగిస్తున్న హెలీకాప్టర్ స్థానంలో ఎయిర్ బస్ హెచ్ 160 ఛాపర్ ను ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఇతర విఐపిల పర్యటనల కోసం వినియోగిస్తోంది. కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారనే ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టేశాయి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రపూరితంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.





















