AP Secret G.O : జీవోలన్నీ ఆఫ్‌లైన్‌లో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం ! నిబంధనలు అంగీకరిస్తాయా..?
ప్రభుత్వ శాఖలన్నీ జీవోలను ఆఫ్‌లైన్‌లో ఉంచాలని జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బ్లాంక్ జీవోల వ్యవహారం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులు అన్నీ రహస్యంగా ఉంచాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ నిర్ణయాలు అన్నీ గవర్నమెంట్ ఆర్డర్స్.. జీవోల రూపంలో పబ్లిక్ డొమైన్‌లో ఉంచేవారు. కానీ ఇక నుంచి అన్నీ ఆఫ్‌లైన్‌లో ఉంచాలని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు పోకూడదని సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇక పాలనకు సంంధించిన ఏ అంశాలూ ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం https://goir.ap.gov.in/ పోర్టల్‌లో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ముందు జారీ అయ్యే జీవోలన్నింటినీ ఆఫ్‌లైన్‌లో ఉంచనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు ఇటీవలి కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని నిర్ణయాలపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని బ్లాంక్ జీవోలను ఇటీవల విడుదల చేశారు. వీటిపై టీడీపీ నేతలు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గతంలో కొన్నికీలక నిర్ణయాలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా జారీ చేసి.. నిర్ణయాలను అమలు చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్‌లో ఉంచేవారు. ఇక కోర్టు వివాదాల్లో ఇరుక్కున్న జీవోల సంగతి చెప్పాల్సిన పని లేదు. కీలకమైన జీవోల్లో అనేక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు కొట్టి వేసింది. ఈ వివాదలన్నీ ఎందుకు అని ప్రభుత్వం అనుకుందేమో కానీ ఆఫ్‌లైన్‌లో ఉంచాలని ప్రజలకు అందుబాటులో ఉంచవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (1) (సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇదే విషయంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అనేక సార్లు కోర్టులు కూడా ప్రభుత్వాలకు ఇవే తరహా ఆదేశాలు ఇచ్చాయి. ప్రతి జీవో ప్రజలకు సంబంధించినదని... ప్రజా పాలనకు సంబంధించినదని ప్రజలు చెల్లించిన పన్నుల నిధులను వ్యయం చేసేదని అటువంటి బహిరంగంగా ఉండవలసిన జీవోలను దాచిపెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దేశ భద్రత లేదా ఎవరైనా వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయాల్లో మినహా ప్రతీ విషయం ప్రజలకు తెలియాలని పలు మార్లు న్యాయస్థానాలు ఆదేశించాయి.
అయితే ప్రభుత్వాలు మాత్రం రాజకీయంగా వివాదం అవుతాయనున్న వాటిని రహస్యంగా ఉంచడం ప్రారంభించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం బ్లాంక్ జీవోల పద్దతిని కూడా తీసుకొచ్చింది. ఆ అంశం వివాదాస్పదం కావడంతో ఇక జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇలా చేయడం పారదర్శకమైన పాలన చేయడం కాదని విమర్శలు వచ్చే అవకాశం ఉంది.