AP Bank Loans : ఏపీ సర్కార్ బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2021 నవంబరు వరకూ 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం రాజ్యసభకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారని వాటిని బడ్దెట్ పద్దుల్లో చూపించడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటికి సమాధానం ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల వివరాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2021 నవంబరు వరకూ 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ వెల్లడించారు. ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read : పథకాల అమలు.. అభివృద్ధిలో తోడుగా రండి.. బ్యాంకర్లకు సీఎం జగన్ పిలుపు !
అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్లు రుణం పొందాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7వేల కోట్లు , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్లు , కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు , ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.5,500కోట్లు , ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ.1,750కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు రుణం పొందినట్లుగా తెలిపింది.
Also Read : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !
ఏపీ ప్రభుత్వం ఇటీవల స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి రూ. పాతిక వేల కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణాలను మూడు బ్యాంకుల కన్సార్షియం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇతర కార్పొరేషన్ల పేరుతోనూ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల మీద తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి