APJAC Amaravati : చిన్న మార్పులతో ఉద్యోగుల ఉద్యమ ప్రణాళిక కొనసాగింపు - ప్రభుత్వం తీరుపై నమ్మకం లేదన్న ఉద్యోగ సంఘాలు !
ఏపీ ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాయి. చాలా సమస్యలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదంటున్నారు.
APJAC Amaravati : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఆందోళన చిన్న చిన్న మార్పులతో కొనసాగుతుందని ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్యల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గురువారం నుంచే ఉద్యోగుల కార్యచరణ ప్రణాళిక ప్రకారం ఆందోళనలను నిర్వహించాల్సి ఉంది.అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొ ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆయన పలు ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావటం, మరి కొన్ని డిమాండ్ల పై సానుకూల ప్రకటన చేయటంతో, ఉద్యమం కొనసాగించాలా వద్దా..అనే దాని పై అమరావతి జేఎసి ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జేఎసి నాయకులు పలు అంశాలను చర్చించిన తరువాత భవిష్యత్ కార్యచరణ పై చర్చించారు.
ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రుల కమిటి ఇప్పటికే క్లారిటి ఇచ్చింది. తాము ఇచ్చిన వినతిపత్రం పై చర్చ చేయకుండా పాత సమస్యలపై మాట్లాడుతున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారని, అయితే దాని పై ఇంత వరకు క్లారిటి లేదని బొప్పరాజు పేర్కొన్నారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన 2 వేలకోట్లు సెప్టెంబర్ లోపు చెల్లిస్తామని, డిఎ, ఏరియర్స్ ఎంత ఇవ్వాలి అన్నది స్పష్టత ఇవ్వకపోవటం వెనుక అంతర్యం ఎంటని ఆయన ప్రశ్నించారు. తాము చెప్పిన అంశాల పై చర్చ లేకుండా వాళ్ళు చెప్పాలనుకున్నవి చెప్పి వెళ్లిపోయారని ..11వ పిఆర్సీ, పే స్కెల్ పై స్పష్టత లేకుండా ఉందని, ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
జీతాలు ఒకటో తేదీన ఇవ్వాలని కోరినా మంత్రుల కమిటీ స్పందించలేదని, సిపియస్ ఉద్యోగుల రూ. 1300 కోట్ల రూపాయల డబ్బులను ఇవ్వాల్సి ఉందని తెలిపారు.ఏప్రిల్ నుంచి జిపిఎస్ కు సంబంధించిన ఉద్యోగులకు సమాచారం రావడం లేదని, ప్రభుత్వం నెలాఖరులోగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులకు నమ్మకం లేకుండాపోయిందని అన్నారు.సిపిఎస్ రద్దు అంటుంటే జిపిఎస్ అంటున్నారని ,పాత పెన్షన్ తప్ప ఇతర ఏది తీసుకువచ్చిన మేము అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని, హామీ ఇచ్చారని,అయితే ఆ హామిని అమలు చేయాలని అడుగుతుంటే స్పందన లేకుండాపోయిందని మండిపడ్డారు.
ఉద్యమ కార్యాచరణను చిన్న చిన్న మార్పులు చేసి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని,ఈనెల 17, 20 వ తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల సందర్శన అనంతరం,21 నుంచి వర్క్ రూల్ కొనసాగుతుందని వెల్లడించారు. 26 కారుణ్య నియామకాలు కుటుంబాల సందర్శన యాత్ర కూడ చేయాలని నిర్ణయించామన్నారు. వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి మలి దశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని వెల్లడించారు. ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించి ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమం చేస్తున్న తరుణంలో ,సంఘాల మద్య విభేదాలు తీసుకువచ్చేందుకు కొందరు ప్రయత్నించటం పై బొప్పరాజు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం చిత్తశుద్దిగా పని చేస్తున్నామని,తమకు పూర్తిగా సహకరించి,సమస్యల పరిష్కారానికి అంతా కలసి కట్టుగా ముందుకు రావాలని కోరారు.