Chandrababu: అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు, వెనక్కి తగ్గిన ఆలపాటి రాజా!
TDP Janasena First List: ఎన్నికల్లో ముందడుగు వేయాలంటే అసంతృప్త నేతలను బుజ్జగించడమై సరైన చర్యగా భావించి, పలువురు సీనియర్ నేతలకు అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.
AP Eections 2024: అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకుగానూ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం (ఫిబ్రవరి 24న) ప్రకటించడం తెలిసిందే. కొన్నిచోట్ల టీడీపీపై నేతలు గుర్రుగా ఉండగా, మరికొన్ని చోట్ల తమకు అన్యాయం జరిగిందంటూ జనసేన నేతలు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఎన్నికల్లో ముందడుగు వేయాలంటే అసంతృప్త నేతలను బుజ్జగించడమై సరైన చర్యగా భావించి, పలువురు సీనియర్ నేతలకు అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర (Alapati Raja) తెనాలి సీటు ఆశించారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా తెనాలి నుంచి జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. గత కొంతకాలం నుంచి ఇక్కడి నుంచి పోటీలో ఉండేది నాదెండ్ల మనోహర్ అనే వినిపించింది. ఆలపాటికి టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత నుంచి పిలుపు రావడంతో అమరావతికి వచ్చిన ఆలపాటి రాజేంద్రప్రసాద్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. టికెట్ రాకపోవడంపై ఆలపాటిని చంద్రబాబు సముదాయించారు. ఆయన రాజకీయ భవిష్యత్ కు హామీ ఇవ్వడంతో ఆలపాటి వెనక్కి తగ్గారు. చంద్రబాబుతో భేటీపై ఆలపాటి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ధర్మాన్ని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా అన్నారు. దాంతో నిన్నటి (శనివారం) నుండి వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి ఆలపాటి తెరదించారు.
సీటు ఆశిస్తున్న మరికొందరు నేతలు చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వెళ్లారు. ఇటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, జిల్లా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువస్తున్నారని సమచారం. గుంటూరు వెస్ట్ ఇవ్వాలని ఆలపాటి, యలమంచిలి ఇవ్వాలని గోవింద్ ప్రతిపాదనలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆలపాటి రాజా కామెంట్స్ వైరల్
ఇటీవల పొన్నూరులో నిర్వహించిన సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసించారు.చంద్రబాబు ప్రజా రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తే.. సైకో సీఎం జగన్ అంతా నాశనం చేశారంటూ విమర్శించారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగిన సత్తా, సమర్థత ఉన్న నేత జగన్ అంటూ ఆలపాటి రాజా నోరు జారారు. వెంటనే సముదాయించుకుని.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందన్నారు. జగన్ పాలనతో రాష్ట్ర ప్రజల్లో అభద్రతా భావం పెరిగిందన్నారు. విమర్శంచబోయి పొరపాటున జగన్ ను ఆలపాటి రాజా ప్రశంసించిన మాటల్ని కట్ చేసి, వైసీపీ శ్రేణులు వైరల్ చేశాయి.