CM Jagan Review: ఎప్పుడూ వరి సాగేనా.. అవి సాగుచేసినా రైతులకు ఆదాయం బాగానే వస్తుంది
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరికి బదులు చిరుధాన్యాలు సాగు చేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు బాగా వస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు. ఇలా చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారని సీఎం వెల్లడించారు.
వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం అధికారులతో చర్చించారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలని సూచించారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలన్నారు. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారని అధికారులు తెలిపారు.
'రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలి. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలి. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దీనికి వినియోగించుకోవాలి. నేచురల్ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలి. డిసెంబరులో వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభం.' సీఎం చెప్పారు.
15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీఎం అన్నారు. అగ్రికల్చర్‌కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలన్నారు. ఆర్గానిక్‌వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ వచ్చేలా చూడాలన్నారు.
ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలి. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేయాలి. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌పడుతుందనే విషయం తెలుస్తుంది. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాం. ఎంత బిల్లు కట్టాలో అంత డబ్బునూ ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తోంది. ఆ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతోంది.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాళ్టి వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకూ 421.7 మిల్లీమీటర్లు కురిసిందని వెల్లడించారు. నెల్లూరు మినహా అన్నిజిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌లో ఇవ్వాళ్టి వరకూ 76.65లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాల్లో సాగు అయిందని పేర్కొన్నారు. వర్షాలు బాగా కురుస్తున్నందున మిగిలిన చోట్లకూడా వేగంగా విత్తనాలు వేస్తున్నారని తెలిపారు.