Cm Jagan Delhi Tour: రేపు సీఎం జగన్ దిల్లీ పర్యటన... ప్రధాని మోదీతో భేటీ
ఏపీ సీఎం జగన్ రేపు దిల్లీలో పర్యటించనున్నారు. దిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీ పర్యనటలో సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మూడు రాజధానులు, అమరావతి అభివృద్ధి కార్యాచరణ, తెలుగు రాష్ట్రాల జలవివాదాలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టే అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలు నేరవేర్చాలని సీఎం జగన్ ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీకి వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది.
అమరావతిపై ప్రధాని మోదీతో చర్చ
పోలవరం, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఇప్పటికే వారిద్దరి అపాయింట్ మెంట్ ను సీఎం జగన్ తీసుకున్నారని సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ అంశంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా సానుకూల నిర్ణయం మాత్రం రాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్ పై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు.
Also Read: సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం
ముందస్తు ఎన్నికలపై చర్చించడానికేనా..!
ఈ పర్యటనలో ముందస్తు ఎన్నికలపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఇటీవల హడావుడి మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే అన్నారు. ఈ సమయంలో సీఎం జగన్ దిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బయటకు విభజన సమస్యలు, పెండింగ్ నిధులపై చర్చించేందుకు వెళ్తున్నారని చెబుతున్నా ముందస్తు ఎన్నికలపై చర్చించేందుకు అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
Also Read: తిరుమల దర్శనానికి పదిరోజులపాటు ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి