At Home In Raj Bhavan: రాజ్ భవన్‌లో ‘ఎట్ హోం’, సతీ సమేతంగా హాజరైన సీఎం జగన్ - చంద్రబాబు దూరం!
At Home In Raj Bhavan: విజయవాడలోని రాజ్ భవన్‌లో మంగళవారం 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు.
At Home In Raj Bhavan: విజయవాడలోని రాజ్ భవన్‌లో మంగళవారం 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేశ్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. విశాఖ పర్యటన కారణంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
విజయవాడలో స్వాతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
పేదలు చదివే బడులను పాడుబడేలా చేయడం అంటరానితనం కిందకే వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలు ఇంగ్లిష్‌లో చదువుకోవద్దని గొడవ చేయడం, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనం కిందకే వస్తుందని అన్నారు. మెనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు.
విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాని, నాడు - నేడుతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్ లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన.. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందజేస్తున్నామని వెల్లడించారు.
డిగ్రీ స్థాయిలో వంద శాతం ఫీజు రీయంబర్స్ మెంట్, ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్ లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ చేసామన్నారు. వైద్య శాఖలో ఏకంగా 53 వేల 126 పోస్టులు, రాష్ట్రం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాలు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం, పేదల సహనాన్ని పరీక్షించుకోవడం కూడా అంటరానితనమే అవుతుందన్నారు. పేదలు గెలిచే వరకూ వారి బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పాలనలో ఏ సర్కారు చేయని మార్పులు చేశామన్నారు. 98.5 శాతం వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదన్నారు. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లమ్మల పేరు మీదే ఇస్తున్నామని అన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని వెల్లడించారు.