Chandrababu: వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, లైఫ్ జాకెట్ వేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన
Vijayawada Flood Effected Areas:విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను పరిశీలించారు.
CM Chandrababu: విజయవాడను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు టెంపుల్ సిటీ అతలాకుతలమైంది. విజయవాడలో ఏ బస్తీలో చూసినా నీరే కనిపిస్తుంది. ప్రతి రోడ్డు చిన్నపాటి చెరువును తలిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుడమేరు వాగు పొంగి గ్రామంపై పడింది. దీంతో విజయవాడ సింగ్ నగర్‌లోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భుజాల వరకు నీళ్లు వచ్చాయి. దీంతో సింగ్ నగర్ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. చాలా మంది రోడ్డుపై వరద నీటిలో చిక్కుకున్నారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలను అందిస్తోంది. వరద బాధితులను లైవ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్ష సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం కింద విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
సీఎం సంచలన నిర్ణయం
విజయవాడలో భారీ వర్షం, వరదల పరిస్థితిపై అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో పర్యటించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆయన సింగ్ నగర్‌కు బయలుదేరి వెళ్లారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకున్నారు. సింగ్‌నగర్ కాలనీల్లో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వరద బాధితులను పరామర్మించారు.
విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు గారి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు #APGovtWithFloodVictims#2024APFloodsRelief#NaraChandraBabuNaidu#AndhraPradesh pic.twitter.com/DvHVepGcrk
— iTDP Nellore Parliament (@iTDP_NellorePC) September 1, 2024
వరద తగ్గేవరకు మీతోనే ఉంటా
విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగ్‌నగర్ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘‘బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేని వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటా’’ అని బాధితులకు భరోసా కల్పించారు.
బోటులో వెళ్లిన సీఎం
వరద పరిస్థితులపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముంపు వివరాలను మంత్రి నారాయణ, కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కనకదుర్గ వారధిపై నుంచి కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు భారీగా ఉండడంతో బోటులో వెళ్లారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం సూచించారు. విజయవాడలో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం బాధాకరమన్నారు. సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ రాత్రికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటానని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మున్నేరు ఉగ్రరూపం
ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. నందిగామ వద్ద పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మున్నేరుకు 2.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. నందిగామ-మధిర రోడ్డుపై వరదనీరు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.