(Source: Poll of Polls)
Anna Canteens: అన్నా క్యాంటిన్‌లో రోజుకు ఒకరి ఫుడ్ తయారీకి అయ్యే ఖర్చు ఎంత? కీలక వివరాలు చెప్పిన చంద్రబాబు
Chandrababu: అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని.. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు.
Anna Canteens News: ఏపీలో ‘అన్న క్యాంటీన్’ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు. గుడివాడకు టీడీపీ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గపు ఆలోచనలు, అసమర్థత కారణంగానే అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో పున:ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే..
గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే అన్నారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామన్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్న క్యాంటీన్లను తీసుకువస్తే, గత ప్రభుత్వం వాటిని మూసివేసిందన్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడనే అని చంద్రబాబు గుర్తుచేశారు. అరకొర సంపాదనతో జీవించే వారికి ఆన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు పెట్టామని.. వీటికోసం రూ.130 కోట్లు ఖర్చుచేశామన్నారు. 4 కోట్ల 60 లక్షల మందికి భోజనం పెట్టామన్నారు.
డొక్కా సీతమ్మ ప్రస్తావన
ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ పేరుగాంచారన్నారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..
గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ మూసివేశారని.. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేయొద్దని సూచించినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఖజనా నుంచి నిధులు ఖర్చుచేసి పెట్టకపోయినా.. అన్నదానానికి ఎంతోమంది దాతలు ముందుకొస్తారని, అలాంటివారికి అవకాశం ఇచ్చి ప్రభుత్వంపై భారం పడకుండా క్యాంటీన్లను నిర్వహించాలని చెప్పినా వినలేదని చంద్రబాబు గుర్తు చేశారు. సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అన్నక్యాంటీన్ల కోసం ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని.. పేదప్రజలకు అన్నం పెడితే పెత్తందారీ ఎలా అవుతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
హరేకృష్ణ పై అభినందనల వెల్లువ
అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు రూ.96 ఖర్చు అవుతుందని.. మూడు పూటలా తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లేదా దాతలు భరిస్తారని చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని చెప్పగానే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి రూ.కోటి విరాళం ఇచ్చారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం రూ.కోటి విరాళాన్ని అందజేశారన్నారు.
మరింతమంది దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే.. వివాహ ఖర్చు కొంత తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు. డిజిటల్ రూపంలోనూ విరాళాలు సేకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని చంద్రబాబు అన్నారు.