Chandrababu: ఢిల్లీలో పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్ర జలశక్తిశాఖ మంత్రితో కీలక భేటీ
AP cm chandrababu delhi tour : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
CM Chandrababu Delhi Tour : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు సాగుతున్న తీరు, గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తికి సంబంధించి వ్యవహరించిన విధానం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని, అందుకు అనుగుణమైన సహకారాన్ని, జలశక్తిశాఖ అందించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టు ఆలస్యమవుతోందని, కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాలని కోరారు. ఈ ప్రతిపాదనలు పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రితో భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
కేంద్రమంత్రిని కలిసిన అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లనే పోలవరం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. 13 నెలల కాలం పనులు లేకపోవడం వల్ల ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాలేదని స్పష్టం చేశారు. 2020 ఆగస్టులో వచ్చిన 23 లక్షల క్యూసెక్కుల వరద నిర్మాణం పూర్తికాని ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ నుంచి నుంచి దూసుకొచ్చిందని, ఫలితంగా నీరు సుడులు తిరుగుతూ 50-60 అడుగుల ఇసుకను ఎత్తిపడేసిందన్నారు. ఈ కారణంతోనే డయాఫ్రం వాల్ వద్ద ఇసుక కోతకు గురై దెబ్బతిందని మంత్రి వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఇచ్చిన నివేదికలో ఇదే విషయం చెప్పినట్టు మంచి తెలిపారు. ఇదంతా కచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదమేనన్నారు. ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు.
ఒకే ఏజెన్సీ ఉంటే నిర్మాణంపై బాధ్యత ఉంటుందని, ప్రాజెక్టు నాణ్యత, భద్రత విషయంలో ఇబ్బంది రాదన్నది తమ భావనగా పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంలో కాంట్రాక్ట్ కంపెనీ తప్పిదం ఏమీ లేదని, నిర్మాణ లోపం కూడా లేదన్నారు.
ప్రధాని మోదీ, హోంమంత్రితో భేటీ
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన శనివారం కూడా కొనసాగనుంది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బడ్జెట్‌లో రాజధానితోపాటు ఇతర అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు విడుదలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ప్రధాని, హోంమంత్రితో భేటీ అవుతున్న నేపథ్యంలో ప్రధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సహకారంపై సీఎం చంద్రబాబు నాయుడకు ఈ భేటీ తరువాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.