CM Chandrababu: పోలీస్ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Andhra News: ఏపీలో పోలీస్ శాఖ పని తీరుపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ సీఎం చంద్రబాబు స్పందించారు. నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను గాడిన పెడదామని అన్నారు.
CM Chandrababu Comments About Policing: పిఠాపురం సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం పలు రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) అమాత్యులతో చర్చించారు. నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను గాడిన పెడదామని ఆయన మంత్రులతో అన్నారు. అటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తోన్న సోషల్ మీడియా ప్రచారంపైనా సుదీర్ఘ చర్చ సాగింది. సర్కారును కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని పవన్ కల్యాణ్ మొదటిగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసభ్యకరమైన, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా.. కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వంలో యాక్టివ్‌గా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది. కొంతమంది అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అమాత్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు సరిగ్గా స్పందించడం లేదని.. కింది స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని చంద్రబాబుకు తెలిపారు.
'ఇకపై ఉపేక్షించేది లేదు'
ఇదే సమయంలో కలగజేసుకున్న పవన్ కల్యాణ్.. అందుకే తాను కూడా తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. దీనిపై స్పందించిన సీఎం గత ప్రభుత్వం నుంచే పోలీసులు ఇలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడిన పెడదామని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులపై ఇకపై ఉపేక్షంచేది లేదని స్పష్టం చేశారు.
పవన్ ఏమన్నారంటే.?
తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని 2 రోజుల క్రితం పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితుల్ని పోలీసుల వేగంగా అరెస్టు చేయకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఈ మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండడం ఎందుకు.?. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి.?. నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా.?. బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా.?. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు క్రిమినల్స్‌కు చేయాలి. గత ప్రభుత్వంలో పోలీసులు, అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండబోవు.' అని పేర్కొన్నారు.
వారిపై సీఎం, డీజీపీ ఆగ్రహం
అటు, వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు వదిలేయడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి మితిమీరి ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారించారు. బుధవారం 41 - ఏ నోటీసులిచ్చి విడిచిపెట్టారు. అయితే, దీనిపై సీఎం, డీజీపీ ద్వారకాతిరుమలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కడపలోని ఎస్పీ కార్యాలయానికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమయ్యారు. రవీంద్రారెడ్డి కేసుపై ఆయన ఆరా తీశారు.
Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!