AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
AP Cabinet Decisions 2026: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 , రూ.1002 కోట్ల అమరావతి క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు వంటివి ఇందులో ఉన్నాయి.

Minister Kolusu Parthasarathy Cabinet Briefing: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు పారిశ్రామిక, సామాజిక, పరిపాలనా సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీసిస్తూ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ ڈూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 తో పాటు ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదా ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాజంలో మహిళా భద్రత, భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024 లను ఉపసంహరించి, చట్టపరమైన లోపాలు లేని అత్యంత పటిష్ఠమైన నూతన చట్టాలను రూపకల్పన చేయాలని నిర్ణయించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.
రాజధాని అమరావతిని గ్లోబల్ నాలెడ్జ్, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగమైన అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి కేబినెట్ రూ. 1,002.49 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనుల బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి అప్పగించే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దీనితో పాటు అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అమరావతి వన్ రీ-టెండర్లకు, హైకోర్టు భవనాల విస్తరణ , అనుబంధ మౌలిక వసతుల కల్పనకు రూ. 206 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం సమ్మతించింది.
రాష్ట్రంలోని ప్రాథమిక రంగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ టారిఫ్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఊరటనిచ్చింది. మౌలిక వసతుల విస్తరణలో భాగంగా కుప్పం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 12.44 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధిలో భాగంగా త్వరలో రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని గోదావరి పుష్కర్ ఘాట్ల ఆధునీకరణకు రూ. 210 కోట్లు మంజూరు చేయడానికి ప్రాథమిక ఆమోదం లభించింది.
#WATCH | Amaravati: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu chairs a cabinet meeting at the Secretariat.
— ANI (@ANI) August 6, 2026
Source: Andhra Pradesh CMO pic.twitter.com/rvbbjSfCDs
పట్టణాభివృద్ధి పరిపాలనను క్రమబద్ధీకరించే లక్ష్యంతో రాష్ట్రంలోని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDAs) పునర్వ్యవస్థీకరణకు, మున్సిపల్ భూముల లీజు గడువు పెంపు నిబంధనల చట్టసవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రహదారి ప్రమాదాల నివారణకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాదచారులు భద్రత పాలసీ-2026 ను అమలు చేయాలని నిర్ణయించారు. పారదర్శకమైన పాలన అందించడం ద్వారా సాధారణ పౌరులతో పాటు వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పార్థసారధి పేర్కొన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను రీ-టెండరింగ్ ద్వారా పట్టాలెక్కించడం, బాధితులకు వేగంగా ఎక్స్‌గ్రేషియా అందజేయడం , వివాదాస్పద పాత చట్టాలను తొలగించి పటిష్ఠమైన రాజ్యాంగబద్ధ చట్టాలు తీసుకురావడం ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలుగా మారాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















