AP Liquor Policy: ఏపీ మద్యం పాలసీపై హోం మంత్రి అమిత్ షాకు పురందేశ్వరి ఫిర్యాదు
Liquor sales in AP: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో మద్యం అమ్మకాలలో జరిగిన అవకతవకలపై కేంద్ర మంత్రి అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు.
Liquor sales in AP:
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై టీడీపీతో పాటు బీజేపీ చేస్తున్న ఆరోపణలలో మద్యం అమ్మకాలు ఒకటి. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో మద్యం అమ్మకాలలో జరిగిన అవకతవకలపై కేంద్ర మంత్రి అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలలో లెక్కలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పురందేశ్వరి ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి షా దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్నారు. మద్యం అమ్మకాలు, లెక్కలపై సీబీఐతో విచారణ జరిపించాలని అమిత్ షాకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అమిత్ షాకి ఆమె వినతిపత్రం అందజేశారు.
మద్యం అమ్మకాలపై అనుమానం వచ్చి ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లి పరిశీలించినట్లు అమిత్ షా దృష్టికి పురంధేశ్వరి తీసుకొచ్చారు. అప్పటివరకూ దాదాపు లక్ష రూపాయల వరకు విక్రయాలు జరిగితే కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్ చెల్లింపులు అయినట్లు గుర్తించామని పురందేశ్వరి చెప్పారు. మద్యం ద్వారా గత నాలున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం వైసీపీ నేతలకు చేరుతున్నాయని ఆరోపించారు.
వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు
సెప్టెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్ లో పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మద్యం అమ్మకాలు, అందుకు సంబంధించిన బిల్లుల గురించి ఆరా తీశారు. లక్షల రూపాయల మద్యం అమ్మి కేవలం వందల్లో మాత్రమే బిల్లు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఇలా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. మద్యం దుకాణం నుండి మందు బాటిళ్లు తీసుకుని రోడ్డుపై పగలగొట్టి నిరసన తెలిపారు.
ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిని సైతం పురందేశ్వరి పరామర్శించారు. రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం అమ్మకాలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా కూడా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీనమేషాలు లెక్క వేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.