United Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా - ఇంతకీ సజ్జల ఎందుకు అలా అన్నారంటే !
United Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతున్నాయి. మూడు పార్టీలకు చెక్ పెట్టే కామెంట్లు అవి.
సమైఖ్య రాష్ట్రంగా ఏపీ తిరిగి కలిసి పోవాలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతున్నాయి. అయితే సజ్జల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తో పాటుగా, వైఎస్సార్‌టీపీ నేత షర్మిల అభ్యంతరం తెలపడంతో ఎటువంటి సందర్భం లేకుండా సజ్జల ఇలా ఎందుకు మాట్లాడారనే విషయంపై వైసీపీలోనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమైఖ్య అంశం మరోసారి తెరమీదకు తీసుకువచ్చి ఆ మూడు పార్టీలను మరోసారి ప్రజల ముందు నిలబెట్టాలనే ఆలోచన చేశారని పార్టీలో చర్చ మొదలైంది.
తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తిరిగి కలసి పోవాలనే అంశంపై చర్చ జరిగితే, వైసీపీ ఒక అడుగు ముందుకు వేసి పోరాటం సాగిస్తుందని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ అంశంపై చర్చ మెదలైంది. కొన్ని వర్గాలు సజ్జల వ్యాఖ్యలను లైట్ తీసుకుంటే, మరికొందరు అలా జరిగే ఛాన్స్ లేదని తెగేసి చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలవటం జరిగేది కాదు కాబట్టి దాని గురించి చర్చ అనవసరం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తెలంగాణ నేతలు సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి ఉపయోగం లేనివని టీఆర్ఎస్ నేతలు అంటే, షర్మిల సైతం సజ్జల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎంతో మంది త్యాగధనుల పోరాటం వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆంధ్రా పాలకులు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
ఇంతకీ సజ్జల ఎందుకు అలా అన్నారు..
సజ్జల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఏ కారణంగా సజ్జల సమైఖ్య రాగం అందుకున్నారని వైసీపీ నేతలు సైతం ఆలోచించడం మొదలుపెట్టారు. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు సేల్ అయ్యేది కాదు. అలాంటప్పుడు సజ్జల వంటి కీలక నేత ఇప్పుడు ఈ అంశం పై ఎందుకు మాట్లాడారానే సందేశం మాత్రం సీనియర్ నేతల్లో వ్యక్తం అవుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. వాస్తవానికి రాష్ట్ర విభజనకు మూడేళ్ళ ముందు వైసీపీ ఆవిర్భవించింది. విభజన సమయంలో వైసీపీ రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలనే భావించింది. మరి సజ్జల ఇప్పుడు సమైఖ్య విధానంపై మాట్లాడటం వెనుక అంతర్యంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపి, టీడీపీ కీలకంగా మారాయి. ఈ మూడు పార్టీలు విభజనలో కీలక పాత్ర పోషించాయి. విభజన అంశం ఏపీలో ప్రధానంగా చర్చకు వస్తే ముందు వరుసలో ఉండేది ఈ మూడు పార్టీలే కావటంతో ఇప్పుడు అదే కోణంలో ఆలోచించి రాజకీయంగా ఆ పార్టీలను టార్గెట్ చేసి సజ్జల మాట్లాడారని అంటున్నారు.
ఏపీలో బీజేపి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా వ్యవహరించిన విభజన అంశం పై చర్చ మెదలయితే, సెంటిమెంట్ గా ఏపీ ప్రజలు ఆ నాటి ఉద్యమాలు కళ్ళ ముందుకు వస్తాయి. దీంతో రాజకీయంగా వైసీపి ఈ వ్యవహరం పై చర్చ లేపితే, రాజకీయాలు అంతా వాటిపై నడుస్తాయి, కాబట్టి మార్కులు వైసీపీకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నది సజ్జల వ్యూహమని పార్టి నేతలు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ కు ఆదరణ ఉంది కాబట్టి, మెజార్టీ సీట్లు వైసీపీకే దక్కుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే విభజన ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకుగానూ 151 స్థానాలు వైసీపీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాలలో మెజార్టీ వైసీపీకే వస్తుందని వైసీపీ లెక్కలు వేస్తుంది. సో ఈ ప్రాతిపదికన వైసీపీకే ఎక్కువ బలం ఉందని చెప్పుకోవటంతో పాటుగా, మరో సారి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువళ్ళటం ద్వారా రాజకీయంగా మరింత ఎదిగేందుకు ఉపయోగపడుతుంది కాబట్టే సజ్జల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.