Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
YSR Statue Vandalism in Nandyal | ఏపీ ప్రజలు ఛీకొడుతున్నా వైఎస్ జగన్ డ్రామాలు మానడం లేదని, కుట్రలు చేస్తున్నారంటూ నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

నంద్యాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) విగ్రహం ధ్వంసమైన ఘటనపై ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య... వైసీపీ నేతల ముఖ్య అనుచరుడేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నేతలు ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
జగన్నాటకాలు చూసి జనం ఛీకొడుతున్నారు: నారా లోకేష్ మండిపాటు
గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించడం, కోడికత్తి దాడి, ఎన్నికల ప్రచారంలో గులకరాయి డ్రామాలు వంటి నాటకాల రాయుడైన జగన్.. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం మరో కొత్త డ్రామాకు తెరలేపారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే సైకో జగన్ తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
#PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) May 31, 2026
జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన… pic.twitter.com/1mgKiaiEik
ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను చూసి ప్రజలు ఇప్పటికే ఛీకొట్టినా, జగన్ మాత్రం తన క్షుద్ర రాజకీయాలు మానడం లేదని, ఎన్నిసార్లు తప్పు చేస్తూ దొరికిపోయినా ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని నారా లోకేష్ దుయ్యబట్టారు.కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పదే పదే డ్రామాలాడుతూ దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం.. ఆమరణ దీక్షకు దిగుతానని షర్మిల హెచ్చరిక
దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) విగ్రహాలపై దాడులు జరగడం అత్యంత దారుణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ దాడులు చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్పష్టమైన నిదర్శనమని ఆమె ఆరోపించారు.
పోలీసులు ఎందుకు ఆపడం లేదు..
పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు కనీసం ఆపడానికి ప్రయత్నించకపోవడం హేయమైన చర్య అని షర్మిల మండిపడ్డారు. నిందితుడికి మానసిక స్థితి బాగోలేదని, అతను మనిషే కాదని చెబుతూ, కాంగ్రెస్ శ్రేణులను సంయమనం పాటించాలని పోలీసులు ఉచిత సలహాలు ఇవ్వడం తగదని హితవు పలికారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సైకో వెనుక ఉండి నడిపించింది ఎవరో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాత విగ్రహం స్థానంలో ప్రభుత్వ ఖర్చులతోనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నంద్యాలలో ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించకపోతే, అదే శ్రీనివాస సెంటర్ వద్ద తాను స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబును ఆమె హెచ్చరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























