AP Assembly : మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ! రాజధానులు, కొత్త జిల్లాల బిల్లులు ఖాయం ?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి తేవాలని.. అలాగే కొత్త జిల్లాల బిల్లును కూడా ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మార్చి నాలుగో తేదీన ప్రారంభించి పది రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడమే హైలెట్. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశ పెట్టబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లులను మళ్లీ ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరో సారి మూడు రాజధానుల బిల్లు !
గత నవంబర్‌లో హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకుది. దీంతో ఆ పిటిషన్లపై విచారణ ముగించాలని ప్రభుత్వం కోరింది. రైతులు వాదనలు వినాలని కోరుతున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. రైతుల పిటిషనలన్నీ నిర్వీర్యం అయిపోయాయని కోర్టు భావిస్తే ప్రభుత్వానికి కొత్త బిల్లు పెట్టుకోవడానికి ఎలాంటి చిక్కులు ఉండవు. అయితే రైతుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తే విచారణ కొనసాగుతుంది. అదే జరిగితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో ఉండగా కొత్త బిల్లు పెట్టడం సాధ్యం కాదు. ఈ లోపు తీర్పు వస్తుందని ప్రభుత్వం అంచనాలో ఉంది.
జిల్లాల విభజనపైనా కొత్త బిల్లు !
మరో వైపు ఏపీలో ఇప్పుడు జిల్లాల విభజన కూడా అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది. దాదాపుగా అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రం కోసమో.. పేరు కోసమో.. రెవిన్యూ డివిజన్ల డిమాండ్‌తోనే ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ చిక్కులన్నింటినీ తప్పించుకునేందుకు ఓ కొత్త చట్టం తీసుకు రావాలన్నఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉగాది నాటికి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ దిశగా అసెంబ్లీలో కొత్త బిల్లులను పెట్టి పాస్ చేసుకునే అవకాశం ఉంది.
బడ్జెట్ కూర్పు ఎలా ఉండబోతోంది ?
మరో వైపు ఏపీ బడ్జెట్‌పైనా అందరి దృష్టి ఉంది. ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్న ఏపీ ప్రభుత్వం రెవిన్యూ లోటును ఎలా భర్తీ చేసుకుంటుంది.. ? ప్రాధాన్యత రంగాలకు ఎలా కేటాయింపులు చేస్తుంది..? గత ఏడాది బడ్జెట్ లక్ష్యాలను ఎంత మేర సాధించారన్నదానిపై ఆర్థిక నిపుణుల్లోనూ చర్చలు సాగుతున్నాయి. కేంద్రం నుంచి పన్నుల వాటా,చట్టబద్ధంగా వచ్చే గ్రాంట్లు మినహా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దీంతో రాష్ట్ర ఆదాయం, అప్పుల మీదనే ఆదారపడి బడ్జెట్‌ను సిద్ధం చేయాల్సిఉంటుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనపై ఓ సారి ముఖ్యమంత్రి జగన్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.