Andhra Working hours: ఏపీలో రోజుకు పది గంటల డ్యూటీ - చట్టం ఆమోదం - కానీ ఇందులో అసలు ట్విస్ట్ వేరే!
Labor Law: ఏపీ అసెంబ్లీలో కార్మిక చట్ట సవరణలకు అసెంబ్లీ ఆమోదం లభించింది. రోజుకు పని గంటలు 10కి పెంపు.. మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనికి అవకాశం కల్పించారు.

Labor law 10 Working hours: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం కార్మిక చట్టాల సవరణలకు సంబంధించిన ముఖ్య బిల్లులకు ఆమోదం తెలిపింది. 'ఏపీ షాప్స్ & ఎస్టాబ్లిష్‌మెంట్స్ (అమెండ్‌మెంట్) బిల్, 2025' మరియు 'ఫ్యాక్టరీస్ (ఏపీ అమెండ్‌మెంట్) బిల్, 2025'లకు ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగుల పని వేళలు, మహిళల రాత్రి షిఫ్టులు, ఓవర్‌టైమ్ పరిమితుల్లో ముఖ్య మార్పులు జరుగనున్నాయి. ఈ సవరణలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చేశారు.
శాసనసభలో ఆమోదించిన ఈ బిల్లులు రాష్ట్రంలోని షాపులు, స్థాపనలు, ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగులకు రోజుకు పని గంటలు 8 నుంచి 10కి పెంచారు. ఇది ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమల్లో వర్తిస్తుంది. 6 గంటలు నిరంతర పని చేసిన తర్వాత 30 నిమిషాల రెస్ట్ ఇవ్వాలి. అయితే వారానికి 48 గంటల పని పరిమితిలో మార్పు లేదు. అంటే నాలుగు రోజుల పాటు గంటలు చేయించుకుంటే ఐదో రోజు ఎనిమిది గంటలు చేయించుకోవాలి. తర్వాత రెండు రోజులు సెలవులు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్టులు లో పని చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులు మహిళలకు సమాన ఆర్థిక అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించేందుకు చేశారు.
ఓవర్‌టైమ్ పరిమితి 75 గంటల నుంచి 144 గంటలకు పెంచారు. ఓవర్‌టైమ్ చేసిన పనికి డబ్బు చెల్లింపు, రెస్ట్ పీరియడ్‌లు తప్పనిసరి. రాత్రి షిఫ్టుల్లో పని చేసే మహిళల భద్రత, రవాణా ఖర్చులు యాజమాన్యాలే భరించారు. సురక్షిత రవాణా, వెల్ఫేర్ సౌకర్యాలు, రెస్ట్ రూమ్‌లు కల్పించాలి. యాజమానులు మహిళల అభ్యర్థన మేరకు మాత్రమే రాత్రి షిఫ్టులు కేటాయించాలి. ఏవైనా ఫిర్యాదులకు వెంటనైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సవరణలు జూన్ 2025లో క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడు చట్టంగా మార్చారు. ఇండస్ట్రీలు, ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షించడానికి' ఈ మార్పులు తీసుకు వచ్చామని చంద్రబాబు ప్రకటించారు.
కార్మిక చట్టాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మారుస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం సూచనలు ఇచ్చింది. భారత్‌ను పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వాలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' సూచీలో ర్యాంక్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. సరళీకృత లేబర్ చట్టాలు ఇండస్ట్రీలకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. 2020లో కేంద్రం 29 లేబర్ చట్టాలను నాలుగు కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. ఇది రాష్ట్రాలకు సవరణలకు మార్గం సుగమం చేసింది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి కార్యక్రమాలకు అనుగుణంగా, ఫ్యాక్టరీలు, స్థాపనల్లో ఉత్పాదకత పెంచడానికి లేబర్ చట్టాలను సరళీకరిస్తున్నారు. రోజువారీ పని గంటల పెంపు , ఓవర్‌టైమ్ పరిమితి పెంచడం వంటివి ఇండస్ట్రీలకు ఎక్కువ గంటలు ఉత్పాదన అవకాశం ఇస్తాయి. అదే సమయంలో కార్మికలకు భద్రత , అధిక ప్రయోజనాలు, ఓవర్ టైమ్ ప్రయోజనాలు లభిస్తాయి.





















