Andhra Investments: ఏపీలో రూ.53,922 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు - నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు
Chandrababu: ఏపీలో మరో 50 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది.

Andhra Investments proposals: పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులిస్తున్నామని... అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది.
రూ. 53922 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రూ. 53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని.. అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహింద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని.. దీనికి అనుగుణంగా అధికారులూ స్పందించాలని సీఎం అన్నారు.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలదే ప్రధాన భూమిక
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే కీలకమని.. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామని అన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవన్నారు.
బిజినెస్ సెంటర్ల తరహాలో ఎంఎస్ఎంఈ పార్కులతో ఎకోసిస్టం
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ఈ పారిశ్రామిక పార్కులన్నీ బిజినెస్ సెంటర్లలా చేసి.. ఒక ఎకో సిస్టంను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు, భూ యజమానుల్ని కూడా ఈ పారిశ్రామిక పార్కుల్లో భాగస్వాములను చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేయాలని అన్నారు. ఆటోనగర్ లలో రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవటంపై సమీక్షించిన సీఎం దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావటం ముఖ్యమన్న సీఎం.. ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ ఆధారిత వాల్యూ చైన్ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. అలాగే ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేస్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.





















